ఇది సర్కారా? రౌడీ దర్బారా..? : కేటీఆర్‌ | BRS Leader KTR Comments on CM Revanth | Sakshi
Sakshi News home page

ఇది సర్కారా? రౌడీ దర్బారా..? : కేటీఆర్‌

Nov 5 2025 1:39 AM | Updated on Nov 5 2025 1:39 AM

BRS Leader KTR Comments on CM Revanth

రోడ్‌షోలో ప్రసంగిస్తున్న కేటీఆర్‌. చిత్రంలో సబితారెడ్డి, అభ్యర్థి మాగంటి సునీత, విష్ణువర్ధన్‌ రెడ్డి

వికాసానికి, విధ్వంసానికి మధ్య పోటీ: కేటీఆర్‌

సబ్బండ వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్‌.. విద్యార్థుల భవిష్యత్‌ అంధకారానికి కుట్ర  

ఫీజు బకాయిలు అడిగితే బెదిరింపులా? 

జూబ్లీహిల్స్‌ ఫలితంతో కాంగ్రెస్‌ మైండ్‌ బ్లాంక్‌ కావాలి 

ఉద్యోగులు, విద్యార్థులను బెదిరించి ఏం సాధిస్తావని సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీత

సోమాజిగూడ రోడ్‌షోలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: పేదరికం కారణంగా ఏ విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదనే మహోన్నత లక్ష్యంతో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారకరామారావు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి లక్షలాది విద్యార్థులకు ఉన్నత విద్య పొందే హక్కు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. 

విద్యార్థుల భవిష్యత్‌ అంధకారం చేసేందుకు కాంగ్రెస్‌ కుట్ర పన్నిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా సోమాజిగూడలో భారీ రోడ్‌షోలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సీఎం రేవంత్‌రెడ్డి రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలు కట్టకుండా విజిలెన్స్‌ దాడులతో కాలేజీలను బెదిరిస్తుండటంతో విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

‘ఉద్యోగులకు డీఏ, పీఆర్‌సీలు లేవు. రిటైరైనవారు, ఉద్యోగులు, విద్యార్థులను బెదిరించి ఏం సాధిస్తావు రేవంత్‌రెడ్డీ? తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లోంచి పది శాతం కటింగ్‌ అన్నారు కదా! పెన్షనర్లు నీ తల్లిదండ్రుల్లాంటి వారేకదా.. నీ జీతంలోంచి కోత పెట్టాలా? ఇంతమందిని వేధించి ఏం సాధిస్తావు? మీరు నడుపుతున్నది సర్కారా లేక రౌడీ దర్బారా?’అని దుయ్యబట్డారు.  

మీరే న్యాయమూర్తులు 
‘జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఆషామాషీ ఎన్నిక కాదు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ అభివృద్ధికి, రెండేళ్ల కాంగ్రెస్‌ అరాచకానికి మధ్య జరుగుతున్న పోటీ. ఇది బీఆర్‌ఎస్‌ వికాసానికి, కాంగ్రెస్‌ విధ్వంసానికి, సంక్షేమానికి– సంక్షోభానికి మధ్య జరుగుతున్న పోటీ. ఎవరి పాలన బాగుంటే వారికి ఓటెయ్యండి. 4 కోట్ల మంది 4 లక్షల ఓటర్ల వైపు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో సరైన వారినే గెలిపించండి. మీరే న్యాయనిర్ణేతలు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చినప్పుడున్న జనరేటర్లు, ఇన్వర్టర్లు, నీటికోసం ధర్నాల వంటి సమస్యల్ని ఒక్కటొక్కటిగా పరిష్కరించాం. 

అందరినీ అమ్మలా అక్కున చేర్చుకునే హైదరాబాద్‌లో కార్మీకులకు పని కల్పించాం. పదిలక్షలకు పెరిగిన ఐటీ ఉద్యోగులతోపాటే రియల్‌ ఎస్టేట్, వివిధ వ్యాపారాలు పెరిగాయి. శాంతి భద్రతల సమస్యల్లేకుండా నగరాన్ని కంటికి రెప్పలా కాపాడిన ఘనత కేసీఆర్‌ది. మడిలో ఉండే రైతును, బడిలో ఉండే టీచర్‌ను, గుడిలో ఉండే పూజారిని, చర్చిలో ఉండే పాస్టర్‌ను, మసీదులో ఉండే ఇమాంను ఇలా.. సబ్బండ వర్గాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసగించింది. 

కేసీఆర్, కేటీఆర్‌ల రెండు ఉద్యోగాలు ఊడగొడితే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ నెరవేర్చనందున ఇప్పుడు నిరుద్యోగులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు’అని కేటీఆర్‌ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 420 హామీలిచ్చిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటీ అమలు చేయకుండా అన్నివర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఉచిత నీటి పథకం కూడా ఎత్తివేసి వేలకువేల బిల్లులు ఇస్తుందని అన్నారు. హైడ్రా పేదలపైనే ప్రతాపం చూపుతుందని.. మంత్రులు, పెద్దల జోలికి పోదని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ ఓటర్లు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్‌ మైండ్‌ బ్లాంక్‌ కావాలని తెలిపారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement