పీఎస్సీల సదస్సులో మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్. చిత్రంలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, యూపీఎస్సీ సభ్యుడు రాజ్‌శుక్లా, డిప్యూటీ సీఎం భట్టి
నేటి పాలనకు చదువుల ప్రతిభ ఒక్కటే చాలదు
నైతిక నిర్ణయ శక్తి, భావోద్వేగ మేధస్సు, నాయకత్వం, టీమ్‌వర్క్ ఉండాలి
అలాంటి వారే దేశ సేవలో ముందు వరుసలో నిలబడతారు
పీఎస్సీల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాలనను ముందుకు నడిపే అధికారులు, ఉద్యోగుల ఎంపిక ప్రక్రియలో నైతికతకూ ప్రాధాన్యం ఇవ్వాలని.. ఈ దిశగా పబ్లిక్ సర్విస్ కమిషన్లు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సూచించారు. నేటి పాలనకు కేవలం చదువుల ప్రతిభ ఒక్కటే చాలదన్నారు. నైతికంగా నిర్ణయం తీసుకునే శక్తి, భావోద్వేగ మేధస్సు, నాయకత్వ లక్షణాలు, టీమ్‌వర్క్ చేయించే సత్తా తప్పనిసరి అన్నారు. అలాంటి వారే దేశ సేవలో ముందు వరుసలోకి వస్తారని చెప్పారు. పబ్లిక్ సర్విస్ కమిషన్ (పీఎస్‌సీ)ల రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శనివారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వికసిత్ భారత్–2047 లక్ష్యాలను సాధించాలంటే పరిపాలన నాణ్యతతోపాటు పాలనను నడిపించే వ్యక్తుల నాణ్యత కూడా కీలకమన్నారు.
దేశ పాలనా వ్యవస్థల నాణ్యత, సమగ్రత, సమర్థతను తీర్చిదిద్దడంలో పీఎస్‌సీల పాత్ర కీలకమని చెప్పారు. అర్హత, నిష్పక్షపాత ధోరణి, నైతికత కలిగిన అధికారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత పీఎస్‌సీలపై ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన స్వతంత్రత వల్లే పీఎస్‌సీలు ప్రతిభ, న్యాయం, పారదర్శకతలను కాపాడగలుగుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పీఎస్‌సీలు నిష్పక్షపాత నియామకాల ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని.. పరిపాలనా స్థిరత్వాన్ని నిలబెట్టాయని ప్రశంసించారు.
డిజిటల్ గవర్నెన్స్, మౌలికవసతుల అభివృద్ధి వంటి జాతీయ ప్రాధాన్యాల అమలు అధికారుల నాణ్యతపైనే ఆధారపడి ఉంటుందన్నారు. చిన్నపాటి అవకతవకలు కూడా సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని, పరీక్షల్లో అక్రమాలను ఉపేక్షించొద్దని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. ఉన్నత ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో జ్ఞానాధారిత పరీక్షలతోపాటు ప్రవర్తన, నైతిక నైపుణ్యాల్ని అంచనా వేసే విధానాలను కూడా పీఎస్సీలు పరిశీలించాలని సూచించారు. వ్యక్తిత్వం, నైతిక ప్రవర్తనే దేశ నిర్మాణానికి, ప్రజా విశ్వాసానికి పునాది అని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు.
పాలనా వ్యవస్థకు పీఎస్సీలే వెన్నెముక: డిప్యూటీ సీఎం భట్టి
ప్రభుత్వ పాలనా వ్యవస్థకు పబ్లిక్ సర్విస్ కమిషన్‌లే వెన్నెముక వంటివని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పారదర్శకతే పీఎస్‌సీలకు ప్రాణమని.. ప్రశ్నపత్రాల తయారీ నుంచి తుది ఎంపిక వరకు ప్రతి దశలోనూ సందేహాలకు తావు లేకుండా వాటి పనితీరు ఉండాలన్నారు. పరీక్షల్లో జాప్యం వల్ల యువతలో నిరాశ పెరుగుతుందని.. అభ్యర్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రణాళికాబద్ధంగా పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్లపై ఉందన్నారు. పోటీ పరీక్షల వార్షిక కేలండర్ అమలు ద్వారా వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని భట్టి పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ విజయవంతంగా జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తోందన్నారు.


