ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరున లేదా జనవరి తొలివారంలో జరగనున్న శాసనసభ సమావేశాల్లో జలవివాదాలు–వాస్తవాలు అనే అంశంపై రోజంతా చర్చ జరిగే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో అధికారులు నివేదికతో సిద్ధంగా ఉండాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్. ఉతమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్‌లో నీటిపారుదలశాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) మొహమ్మద్ అంజాద్ హుస్సేన్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ కె.ప్రసాద్‌తో సమీక్షించారు.
తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నీటిపారుదలశాఖలో తీసుకున్న నిర్ణయాలతో కలిగిన నష్టాలపై నివేదిక ఉండాలన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి బరాజ్ కట్టకుండా మేడిగడ్డకు తరలించడం వల్ల కలిగిన నష్టాలను నివేదికలో పొందుపరచాలని ఆదేశించారు. కాళేశ్వరం బరాజ్‌లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చిన అంశాలను నివేదికలో చేర్చాలని సూచించారు.
ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో రాష్ట్ర అవతరణ అనంతరం ఏపీకి 512 టీఎంసీలు కేటాయిస్తే తెలంగాణకు 290 టీఎంసీలు చాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించిన విషయాన్ని కూడా చేర్చాలని నిర్దేశించారు. పాలమూరు–రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీతోపాటు కృష్ణా బేసిన్‌లో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గత ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య వైఖరిని కూడా నివేదికలో పేర్కొనాలని మంత్రి ఉత్తమ్ నిర్దేశించారు. ‘బేసిన్లు లేవు... భేషజాలు లేవు’అంటూ మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించిన అంశాలతోపాటు నాడు ఏపీ సర్కార్‌తో జరిగిన చర్చలన్నీ నివేదికలో రికార్డు కావాలన్నారు.


