అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందే తడవుగా తమిళనాట రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ముఖ్యంగా వరుసగా రెండోసారి విజయం కోసం డీఎంకే సారథి ఎంకే స్టాలిన్ సిద్ధమవుతుండగా.. ఎన్డీయేతో పొత్తు ఉన్నప్పటికీ అన్నాడీఎంకే తడబడుతోంది. జయలలిత మరణానంతరం ఆ పార్టీకి సరైన దిశానిర్దేశం చేసే నేత లేరనే అపవాదును పళనిస్వామి కొంత వరకు దూరం చేస్తున్నా.. పొత్తు ధర్మంలో స్వతంత్ర నిర్ణయాలు పనికి రావనే విషయాలను విస్మరిస్తున్నారు. దీంతో డీఎంకే ఆయనను పది ఓటముల పళనిస్వామి అని హేళన చేస్తుండగా.. అన్నాడీఎంకే నేతలు మాత్రం అధికార పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలంటే.. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు తప్పనిసరి. పళనిస్వామి మాత్రం అన్నాడీఎంకే ఆ లక్ష్యాన్ని సునాయాసంగా సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అన్నాడీఎంకే పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందే. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకేకి సీట్ల సర్దుబాటు కలిసి వస్తుందా? తలనొప్పిని తెచ్చిపెడుతుందా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. అదే సమయంలో సినీనటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగంతో పొత్తుకోసం బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. దక్షిణాదిలో పాగా కోసం తహతహలాడుతున్న బీజేపీ.. విజయ్‌కి పెద్దపీట వేసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే.. ఆ పరిణామం అన్నాడీఎంకేకు ప్రతికూలంగా మారే ప్రమాదం లేకపోలేదని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దళపతి విజయ్ రాజకీయ దురంధురుడు
ప్రస్తుతానికి విజయ్ మాత్రం తాను బీజేపీతో కలిసే ప్రసక్తే లేదంటున్నారు. అయితే.. రాజకీయాల్లో చివరి క్షణం వరకు సమీకరణాలు ఎలామారిపోతాయో పసిగట్టడం కష్టమే..! ఒకవేళ బీజేపీతో కలిసి వెళ్లాలని టీవీకే భావిస్తే.. అన్నాడీఎంకే పొత్తుధర్మంలో భాగంగా పలు స్థానాలను మిత్రపక్షాలకు వదిలేయాల్సి ఉంటుంది. దాంతో.. పార్టీలో రెబెల్స్ పుట్టుకొచ్చి, మరింత తలనొప్పిని తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు బీజేపీ మాత్రం తమిళనాట పాగా వేయడమే పరమావధిగా భావిస్తూ.. దళపతి విజయ్‌ని తమిళ రాజకీయ దురంధరుడిగా భావిస్తోంది. అంటే.. పొత్తు కుదిరితే.. ఎన్డీయే ఘనవిజయం సాధిస్తే.. కింగ్ మేకర్ విజయ్ అవుతారన్నమాట..!
సామ, దాన, బేధ, దండోపాయాలతో
ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ భావిస్తే.. రాజనీతిని ప్రయోగిస్తుంది. రాజనీతిలో అత్యంత కీలకమైన నియమం.. సామ, దాన, బేధ, దండోపాయాలను అందిపుచ్చుకుంటుందని సమాచారం. నామినేషన్ల తేదీ సమీపిస్తున్నా.. అన్నాడీఎంకే తన అభ్యర్థులను ప్రకటించలేదు. ఇప్పుడు తమిళనాట విజయం అనేది అన్నాడీఎంకేకు సీట్ల కేటాయింపు సమస్యే కాదు.. ఒకవేళ మళ్లీ ఓటమిపాలైతే పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదు.
ఎన్డీయే కూటమిలో దళపతి విజయ్?
ఒకవేళ ఎన్డీయే కూటమిలో దళపతి విజయ్ చేరితే.. అన్నా డీఎంకే పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఈ ప్రశ్నలు తమిళ తంబీలను వేధిస్తోంది. అటు డీఎంకే కూడా ఈ పరిణామాలను అత్యంత సమీపం నుంచి పరిశీలిస్తోంది. అయితే.. అన్నాడీఎంకే వర్గాల మేరకు.. ఆ పార్టీ కచ్చితంగా తమకు 130 సీట్లు కావాలనే డిమాండ్‌ను బీజేపీ ముందు పెడుతుంది. పట్టణ, నగర ప్రాంతాల్లో బీజేపీ కొద్దోగొప్పో పుంజుకుంటోంది. టీవీకే విజయ్‌కి కూడా అక్కడ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఉంది. అందుకే.. పళనిస్వామి తనకు పట్టున్న ప్రాంతాలను కోరే అవకాశాలున్నాయి.
అగమ్య గోచరంగా అన్నాడీఎంకే
అవి.. అన్నాడీఎంకేకు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్న కొంగు ప్రాంతం. అంటే పశ్చిమ తమిళనాడులోని నియోజకవర్గాలు. అదేవిధంగా దక్షిణ జిల్లాల్లోనూ అన్నాడీఎంకేకు మంచి పట్టున్నప్పటికీ.. మదురై, ఈరోడ్, దిండిగల్, థేని వంటి ప్రాంతాల్లో టీవీకేకు ఆదరణ పెరుగుతోంది. దీంతో ఆ ప్రాంతాల్లో అన్నాడీఎంకేకు పరిమిత సీట్లే దక్కే అవకాశాలున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాలన్నీ అన్నాడీఎంకేకు కంచుకోటల్లాంటివి. ఇప్పటికీ అక్కడ సంప్రదాయ ఓటర్లున్నా.. పొత్తు ధర్మంలో భాగంగా ఆ స్థానాలను కోల్పోతే.. పార్టీ ఆదరణ క్రమంగా తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు.
మొత్తానికి ఇప్పుడు టీవీకే తమిళనాడులో అన్నాడీఎంకే పాలిట శరాఘాతంగా మారుతోంది. టీకప్పులో తుఫానును పుట్టిస్తోంది. పొత్తు ఉన్నా.. లేకున్నా.. అన్నాడీఎంకే పట్టున్న ప్రాంతాల్లో పాగావేసి, పెను విధ్వంసం సృష్టించేలా ఎదిగే ప్రమాదముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లైతే.. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.


