సదస్సులో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము. చిత్రంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ,మంత్రి సీతక్క తదితరులు
శాంతి సరోవర్ సంస్థ 21వ వార్షికోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
సాక్షి, హైదరాబాద్: ఆధునికత,ఆధ్యాత్మికతల సమ్మేళనమే మన నాగరికతకు అతిపెద్ద బలమని రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్ము అన్నారు. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ సంస్థ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో నిర్వహించిన ‘భారతదేశ శాశ్వత జ్ఞానం: శాంతి, ప్రగతికి మార్గాలు’అంశంపై జరిగిన సదస్సును ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ..సమాజం అనేక మార్పులకు లోనవుతోందని, ఈ మార్పులతో పాటు మనమూ మానసిక ఆరోగ్య సమస్యలు, సామాజిక సంఘర్షణలు, పర్యావరణ అసమతుల్యత, మానవీయ విలువల క్షీణత వంటి అనేక తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నామని చెప్పారు.
సదస్సు కోసం ఎంచుకున్న అంశం చాలా సందర్భోచితంగా ఉంద న్నారు. భౌతిక అభివృద్ధి మాత్రమే సంతోషాన్ని, శాంతిని తీసుకురాలేదని, అంతర్గత స్థిరత్వం, భావోద్వేగ మేధస్సు, విలువలతో కూడిన జీవన విధానం అత్యంత అవసరమన్నారు. సత్యం, అహింస, శాంతియుత సహజీవనం అనే సందేశాన్ని భారతీయ పురాతన ఋషి సంప్రదాయం మనకు ఇచ్చిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ‘వసుధైక కుటుంబం అనే భావన ప్రపంచమంతటినీ ఒకే కుటుంబంగా భావించే ఆలోచన. ఇది నేటి ప్రపంచ శాంతికి అత్యంత అవసరం. సామాజిక ఐక్యతకు, జాతీయ ప్రగతికి ఆధ్యాత్మికత ఒక బలమైన పునాదిగా పనిచేస్తుంది.
ఒక వ్యక్తి మానసిక స్థిరత్వం, నైతిక విలువలు, ఆత్మ నియంత్రణను పెంపొందించుకున్నప్పుడు, వారి ప్రవర్తన సమాజంలో క్రమశిక్షణ, సహనం, సహకారాన్ని పెంపొందిస్తుంది’అని రాష్ట్రపతి పేర్కొన్నారు. దశాబ్దాలుగా బ్రహ్మకుమారీస్ సంస్థ భారతీయ విలువలను వివిధ దేశాలకు విస్తరింపజేయడంపై రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలలో శాంతి, సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా ఈ సంస్థ సమాజం నైతిక, భావోద్వేగ నిర్మాణాన్ని బలోపేతం చేస్తోందని కొనియాడారు.


