
అమెరికాకు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం 'సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్', టెక్ సేవల సంస్థ కాగ్నిజెంట్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని.. ఇండియాలో తన మొట్టమొదటి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. దీనిద్వారా 1,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు.
కాగ్నిజెంట్ కొత్త జీసీసీ సెంటర్.. ఎంటర్‌ప్రైజ్ టెక్ సామర్థ్యాలు, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ప్లాట్‌ఫామ్‌లు, డేటా అనలైజ్, ఉత్పత్తి ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. నిజానికి ఇదొక ఇన్నోవేషన్ హబ్ మాదిరిగా పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది.

హైదరాబాద్‌లో దాదాపు 57,000 మంది సిబ్బందిని కలిగి ఉన్న కాగ్నిజెంట్.. దాని AI-ఆధారిత ప్లాట్‌ఫామ్‌లైన న్యూరో, ఫ్లోసోర్స్‌లను ఉపయోగించి సిటిజన్స్ జీసీసీకి అదనపు శక్తిని ఇవ్వనుంది. అంతే కాకుండా క్లౌడ్, డేటా, సైబర్ సెక్యూరిటీ,ఇంటెలిజెంట్ ఆటోమేషన్‌లో భవిష్యత్తు అవసరానికి కావలసిన పరిష్కారాలను అందిస్తుంది.

అమెరికా కంపెనీ.. కాగ్నిజెంట్‌తో కలిసిన సందర్భంగా ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సిటిజన్స్ బ్యాంక్, కాగ్నిజెంట్ చేతులు కలపడంతో, భారతదేశ జీడీపీకి 1 ట్రిలియన్ డాలర్లు అందించే మొదటి రాష్ట్రంగా అవతరించే లక్ష్యానికి తెలంగాణ దగ్గరగా ఉందని అన్నారు. ప్రస్తుతం బలమైన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు.