హైదరాబాద్: ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ చెయిన్ మెక్ డోనాల్డ్ తన గ్లోబల్ ఆఫీస్‌ను హైదరాబాద్‌లో తెరిచింది. టీ హబ్ సమీపంలో ఏర్పాటైన మెక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ ప్రతిభపై విశ్వాసం, పరిపాలనపై నమ్మకానికి మెక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ ఒక ప్రతీక అన్నారు. మెక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ కోసం హైదరాబాదును కేంద్రంగా ఎంచుకోవడం తెలంగాణ అద్భుత ప్రతిభకు నిదర్శనం అన్నారు. జీసీసీలకు రాజధానిగా హైదరాబాద్ నిలిచిందన్నారు. మాజీ ప్రధాని నెహ్రూ మొదలుకొని ఆ తర్వాత పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి మహా నేతలు దూరదృష్టితో చేపట్టిన చర్యల మూలంగా హైదరాబాద్ కు మరింత బలం చేకూరిందని డిప్యూటీ సీఎం వివరించారు.
మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ నాయకత్వ బృందాన్ని, సిబ్బందిని హైదరాబాద్‌కు స్వాగతించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. 1940లలో మెక్‌డొనాల్డ్స్ ప్రారంభమైనప్పుడు, అది కేవలం ఆహారం గురించి మాత్రమే కాదు.. పరిమాణం, సామర్థ్యం, అనుసంధానమైన ప్రపంచం అనే భావనకు ప్రతీకగా నిలిచిందన్నారు.
మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ ఈ నూతన కేంద్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న కొత్త పరిణామంలో కీలక అధ్యాయం అని అభివర్ణించారు. గత రెండు దశాబ్దాల్లో హైదరాబాద్ ఇటువంటి అనేక సెంటర్లకు రాజధానిగా మారిందని, వందలాది గ్లోబల్ కేపబిలిటీ హబ్‌లు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వివరించారు.


