సాక్షి,హైదరాబాద్: ఏపీ టీడీపీ నేత కేఈ ప్రభాకర్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుటుంబం మధ్య తుపాకీ కలకలం రేగింది. ప్రభాకర్ అల్లుడు, నందీశ్వర్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్‌కు ఓ ఇంటి అగ్రిమెంట్ విషయంలో విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వారం క్రితం వివాదం రేగింది. దీంతో ఓ వర్గం తుపాకీతో బెదిరించిందంటూ.. రెండో వర్గం తాజాగా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
దీనిపై రాయదుర్గం ఎస్‌హెచ్‌ఓ సీహెచ్ వెంకన్న మాట్లాడుతూ.. ఏపీకి చెందిన ఒక రాజకీయ నేత కూతురు, తెలంగాణకు చెందిన ఒక రాజకీయ నేత కుమారుడు విషయంలో వివాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. వీరిద్దరూ భార్యభర్తలని, వీరికి 14 ఏళ్ల క్రితం పెళ్లయిందని, వ్యక్తిగత సమస్యల కారణంగా ఈ జంట ఒక సంవత్సరం నుండి విడివిడిగా నివసిస్తున్నారన్నారు.
గత నెల 25న, మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్న ఒక ఆస్తి విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తిందని,. దీనికి సంబంధించి, రెండు వర్గాలు రాయదుర్గం పోలీసులను సంప్రదించి, ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఫిర్యాదులు సమర్పించారన్నారు. వీరి ఫిర్యాదులు స్వీకరించి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇక కాల్పుల నివేదిక సంబంధించి అటువంటిది ఏదీ తమ దృష్టికి రాలేదన్నారు. కాల్పులకు సంబంధించి ఏదైనా ఆధారాలు కనిపిస్తే, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


