రామచంద్రాపురం (పటాన్‌చెరు): ఇంట్లో స్నేహితుడితో ఉన్న సమయంలో అకస్మాత్తుగా తండ్రి రావడం చూసి భయపడిన కూతురు.. తమ బాల్కనీ నుంచి మరో బాల్కనీకి వెళ్లే ప్రయత్నంలో ఎనిమిదో అంతస్తు పైనుంచి కిందపడి మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పరిధిలోని ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ నగర్‌లో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. కొల్లూరు సీఐ గణేశ్ పటేల్ కథనం ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీలో నివాసముండే యువతి (20) ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. అక్కడ ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది.
ఆ యువతి కుటుంబానికి తెల్లాపూర్ పరిధిలోని ప్రభుత్వ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఇల్లు ఉంది. కాగా గురువారం స్నేహితుడితో కలిసి కేసీఆర్ నగర్ కాలనీలోని 8వ అంతస్తులో ఉన్న తమ ఇంటికి వచ్చింది. వారిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు నగరం నుంచి యువతి తండ్రి అక్కడికి వచ్చాడు. తలుపులకు తాళం తీసి ఉండటంతో.. లోపల ఎవరున్నారని అతను గట్టిగా అరిచాడు. తండ్రి మాటలు విన్న యువతి భయంతో ఎనిమిదో అంతస్తు బాల్కనీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్క బాల్కనీలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే పట్టుతప్పి ఆమె పైనుంచి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


