పీఎస్సీల జాతీయ సదస్సులో మాట్లాడుతున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. చిత్రంలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, యూపీఎస్సీ చైర్మన్ అజయ్‌కుమార్
అభ్యర్థుల్లో ఇవే కీలకం.. పీఎస్సీలు వీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి
జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
అధికారుల సమగ్రత, సున్నితత్వం, సామర్థ్యం వల్లే స్థిరమైన కార్యనిర్వహణ సాధ్యమవుతుంది
ఈ లక్షణాలున్న వారిని ఎంపిక చేస్తే ప్రభుత్వ వ్యవస్థ పకడ్బందీగా ముందుకెళ్తుంది: ముర్ము
జాబ్ కేలండర్‌కు కట్టుబడి నియామకాలు జరిపితే విశ్వాసం పెరుగుతుందన్న గవర్నర్
పీఎస్సీల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్: యూపీఎస్సీ చైర్మన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పరిపాలన నిష్పక్షపాతంగా, స్థిరంగా కొనసాగడంలో అధికారుల పాత్రే కీలకమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యాఖ్యానించారు. అలాంటి అధికారుల ఎంపిక బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్ల (పీఎస్సీ)పై ఉందని గుర్తుచేశారు. ఈ విషయంలో సమగ్రత, నిజాయితీ అనే కీలక అంశాలకు పీఎస్సీ లు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ‘ఈ లక్షణాలున్న వారిని ఎంపిక చేస్తే ప్రభుత్వ వ్యవస్థ పకడ్బందీగా ముందుకెళ్తుంది. ఈ రెండు అంశాలు రాజీ పడేందుకు అవకాశం లేనివి. నైపుణ్యాలు, సామర్థ్యాల సంబంధిత లోపాలుంటే వాటిని నేర్చుకోవడం, ఇతర కార్యక్రమాలు, వ్యూహాల ద్వారా అధిగమించవచ్చు. కానీ సమగ్రత లోపం తీవ్రమైన సవాళ్లను రేకెత్తిస్తుంది, వాటిని అధిగమించడం అసాధ్యం. కాబట్టి పీఎస్సీలు తాము నియమించే అభ్యర్థుల విషయంలో నిజాయితీ, సమగ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి..’ అని రాష్ట్రపతి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న రెండ్రోజుల పీఎస్సీల జాతీయ సదస్సుకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శుక్రవారం తొలిరోజు సదస్సులో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు.
ఉత్తమ సివిల్ సర్వెంట్లను ఎంపిక చేయగలగాలి..
‘ప్రభుత్వ అధికారుల సమగ్రత, సున్నితత్వం, సామర్థ్యం వల్లే స్థిరమైన కార్యనిర్వహణ సాధ్యమవుతుంది. జాతీయ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ద్వారా సివిల్ సర్వెంట్లు ఎంపికవుతుంటే.. రాష్ట్రస్థాయిలో పీఎస్సీలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అభ్యర్థుల నైతిక ధోరణిని అర్థం చేసుకోవడానికి సహాయపడే సాధనాలు, ఉపకరణాలను పీఎస్సీలు వెతకాలి. సివిల్ సర్వెంట్ ఉద్యోగం సాధించాలనుకునే యువతలో అట్టడుగు వర్గాలు, బలహీనుల కోసం పనిచేయాలనే మనస్తత్వం ఉండాలి. అదేవిధంగా మహిళల అవసరాలు, ఆకాంక్షల విషయంలో సున్నితమైన వైఖరి కలిగి ఉండాలి.
ఇలాంటి వారితో పాటు సాంకేతికత సవాళ్లను ముందుగానే ఊహించడం, పారదర్శకత, విశ్వసనీయతను బలోపేతం చేయడం, ప్రపంచ స్థాయితో పోల్చదగిన సివిల్ సర్వెంట్ల బృందాలను ఎంపిక చేసేలా పీఎస్సీలు సిద్ధం కావాలి. పీఎస్సీల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, ఉత్తమ అనుభవాలను పంచుకోవడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుంది. సాంకేతికత, చట్టపరమైన అంశాలు, నియామక ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేయడం.. వంటి అంశాలు చర్చకు రావడంతో పాటు కమిషన్ల ముందున్న ముఖ్యమైన సమస్యలకు పరిష్కారాలు ఈ చర్చల నుంచి లభిస్తాయని ఆశిస్తున్నా..’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
పీఎస్సీలకు విజయం చేకూరాలి
‘ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. ప్రధాన ఆర్థిక వ్యవస్థ, అపారమైన వైవిధ్యం కలిగిన దేశంగా ఉన్న భారత్‌కు అన్ని స్థాయిల్లో అత్యంత సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థలు అవసరం. త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించే దిశగా కూడా ముందుకు సాగుతున్నాం.
ఈ నేపథ్యంలో యూపీఎస్‌సీ, అన్ని రాష్ట్రాల పీఎస్సీలు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ, ఉత్తమ, ‘భవిష్యత్తు–సిద్ధమైన’ సివిల్ సర్వెంట్ల బృందాన్ని తయారు చేసేందుకు దోహదపడతాయని ఆశిస్తున్నా. అలాంటి సివిల్ సర్వెంట్లు.. నవ్యత, స్థిరత్వం, సృజనాత్మకత, వేగవంతమైన ఆధునికీకరణ, జాగ్రత్తతో కూడిన నిర్ణయాత్మకతను మేళవించాలి. యూపీఎస్‌సీ, రాష్ట్రాల పీఎస్సీల దేశ నిర్మాణ ప్రయత్నాల్లో నిరంతర విజయం చేకూరాలని కోరుకుంటున్నాను..’ అని ముర్ము చెప్పారు.
టీజీపీఎస్సీకి జాతీయ స్థాయిలో గుర్తింపు: గవర్నర్
దేశంలోనే అత్యంత పిన్న వయసున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గతేడాది కమిషన్ షెడ్యూల్ చేసిన అన్ని పరీక్షలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు అర్హులైన యువతను రికార్డు స్థాయిలో ఉద్యోగాలకు ఎంపిక చేసిందని చెప్పారు. ప్రజాస్వామ్య పాలనకు యూపీఎస్సీ, పీఎస్సీలు వెన్నెముకలాంటివన్నారు. జాబ్ క్యాలెండర్‌లు, కాలపరిమితులకు కట్టుబడి నిష్పక్షపాతంగా, మెరిట్ ఆధారిత నియామకాల ద్వారా యూపీఎస్సీ, పీఎస్సీలు సమర్థవంతమైన, నైతికత, సేవాభావం కలిగిన వ్యక్తులు ప్రభుత్వ పరిపాలనలో చేరేలా చూడాలని గవర్నర్ ఆకాంక్షించారు.
సంస్థాగత విశ్వసనీయతను కాపాడేందుకు వీలుగా పీఎస్సీలు సమయానికి నోటిఫికేషన్లు ఇవ్వాలని, పరీక్షలు, ఫలితాల ప్రకటనలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రశ్నపత్రాల తయారీ నుంచి మూల్యాంకనం, ఇంటర్వ్యూల వరకు ప్రతి ప్రక్రియలో పారదర్శకత ప్రధానమైనది కావాలన్నారు. పీఎస్సీలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ప్రధానంగా నియామకాలకు, పరీక్షా ప్రక్రియలకు.. అనవసరమైన కోర్టు కేసులు అడ్డంకిగా మారుతున్నాయని చెప్పారు. పరీక్షల పునర్‌నిర్వహణ లాంటి సమస్యలు నిజాయితీ కలిగిన అభ్యర్థుల్లో నిరాశకు కారణమవుతాయన్నారు. ఈ అంశాలపై సదస్సులో చర్చించి పరిష్కార మార్గాలను గుర్తించాలన్నారు.
యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాలు
యూపీఎస్సీ చైర్మన్ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. కమిషన్ వందేళ్ల పండుగ జరుపుకుంటోందని, వచ్చే ఏడాది అక్టోబర్ వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్తమ అనుసరణలు, అధునాతన సాంకేతికతలను అవలంబించడం ద్వారా పీఎస్సీల ప్రమాణాలు, పనితీరును మరింత మెరుగుపరిచేలా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను స్థాపించే ఆలోచన ఉన్నట్టు వెల్లడించారు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు సదస్సులో భాగంగా పీఎస్సీల్లో సాంకేతికత ఉన్నతీకరణ, నియామక ప్రక్రియలలో బ్లాక్‌చైన్ సాంకేతికత వినియోగం, ఇంటర్వ్యూ ప్రక్రియలో మార్పులు తదితర అంశాలపై చర్చించారు.


