యూఎస్‌ ట్రెజరీ సెక్యూరిటీలను తగ్గించిన భారత్‌.. | Why BRICS Bloc Pulls Back From US Bonds, A Strategic Shift Toward De-Dollarization | Sakshi
Sakshi News home page

యూఎస్‌ ట్రెజరీ సెక్యూరిటీలను తగ్గించిన భారత్‌..

Oct 14 2025 11:39 AM | Updated on Oct 14 2025 12:15 PM

why BRICS Bloc Pulls Back from US Bonds

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో బ్రిక్స్ (BRICS) కూటమికి ‍ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందులోని కొన్ని సభ్య దేశాలు అమెరికాలోని తమ పెట్టుబడులను గణనీయంగా తగ్గిస్తున్నాయి. భారతదేశం, చైనా, బ్రెజిల్ అమెరికా ట్రెజరీ బాండ్లలో తమ ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకుంటున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డీ-డాలరైజేషన్ దిశగా జరుగుతున్న మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.

యూఎస్ ట్రెజరీ విభాగం జారీ చేసిన డేటా విశ్లేషణ ప్రకారం.. భారతదేశం, చైనా, బ్రెజిల్, సౌదీ అరేబియా సహా పలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు (ఎమర్జింగ్ మార్కెట్స్) జులై 2024 నుంచి జులై 2025 మధ్య కాలంలో అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో తమ వాటాలను తగ్గించుకున్నాయి.

వ్యూహాత్మక మార్పు

ఇండియా విషయంలో ఇది కీలకమైన పరిణామం. జులై 2025 నాటికి భారత్ వద్ద ఉన్న అమెరికా ప్రభుత్వ బాండ్ల విలువ 219 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇది జులై 2024లో ఉన్న 238.8 బిలియన్ల డాలర్లతో పోలిస్తే 8 శాతం తక్కువ. గతంలో భారత్ అమెరికా ట్రెజరీ సెక్యూరిటీల నిల్వలను క్రమంగా పెంచింది. జులై 2018లో ఉన్న 142.6 బిలియన్‌ డాలర్ల నుంచి ఏటా 7 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (CAGR)తో పెంచుతూ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విదేశీ మారక ద్రవ్య వ్యూహంలో యూఎస్‌ ట్రెజరీ సెక్యూరిటీలను తగ్గించుకోవడానికి మూడు ప్రధాన కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

బలహీనపడిన డాలర్: డొనాల్డ్ ట్రంప్ యూఎస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి డాలర్ బాగా బలహీనపడింది. ఈ సంవత్సరంలో డాలర్ ఇండెక్స్ దాదాపు 9 శాతం పడిపోయింది.

రూపాయికి రక్షణ: డాలర్లను విక్రయించడం ద్వారా రూపాయి విలువ క్షీణించకుండా కాపాడటానికి డాలర్ నిల్వలను ఉపయోగించారు.

నిల్వల వైవిధ్యత: ఆర్‌బీఐ తన నిల్వలను వైవిధ్యపరచడంలో భాగంగా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. బంగారం నిల్వలు పెరగడం వల్ల జులై 2024 నుంచి జులై 2025 మధ్య మొత్తం ఫారెక్స్ నిల్వలు 4 శాతం పెరిగాయి.

బ్రిక్స్, ఎమర్జింగ్ మార్కెట్స్ దూకుడు..

భారతదేశం మాత్రమే కాకుండా ఇతర ఎమర్జింగ్ మార్కెట్లు ఇదే ధోరణిని అనుసరిస్తున్నాయి. చైనా తన బాండ్ హోల్డింగ్‌లను 5.9 శాతం తగ్గించింది. ఈ విభాగంలో బ్రెజిల్ అత్యధికంగా 12 శాతం తగ్గింపును నమోదు చేసింది. సౌదీ అరేబియా తన హోల్డింగ్‌లను 7.7 శాతం తగ్గించుకుంది. అయితే ఇందుకు విరుద్ధంగా యూఏఈ అసాధారణంగా తన హోల్డింగ్‌లను 56.5 శాతం పెంచి 107.8 బిలియన్‌ డాలర్లకు చేర్చింది.

కొన్ని దేశాలు మాత్రం..

బలహీనపడిన డాలర్, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరెన్సీల బలహీనత వంటి అంశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలను డీ-డాలరైజేషన్ వైపు నెడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చాలా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం కొనసాగించాయి. డాలర్‌పై తమ విశ్వాసాన్ని కొనసాగిస్తూ జపాన్ (5.3 శాతం), జర్మనీ (2.7 శాతం), ఫ్రాన్స్ (34.7 శాతం), యూకే (22.6 శాతం) వంటి దేశాలు అదే కాలంలో తమ యూఎస్ ప్రభుత్వ బాండ్ హోల్డింగ్‌లను పెంచాయి.

ఇదీ చదవండి: ముందుంది మొసళ్ల పండుగ! ఈరోజు కేజీ వెండి రూ.2 లక్షలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement