అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ తన పట్టును బిగిస్తోంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న భారత్-యూరోపియన్ యూనియన్ (EU) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు మంగళవారంతో ముగిశాయి. ఇదే సమయంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై వస్తున్న ఊహాగానాలపై కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు స్పష్టతనిచ్చారు. భారత్ తన ప్రతిపాదనలను ఇప్పటికే సిద్ధం చేసిందని, యూఎస్‌తో ట్రేడ్ డీల్ పరంగా ఇప్పుడు ముందడుగు వేయాల్సింది అమెరికానే అని తేల్చి చెప్పారు.
అమెరికా అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని కొందరు సభ్యులు చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలను ప్రస్తుత చర్చలతో ముడిపెట్టవద్దని అధికారులు హెచ్చరించారు. ‘భారత్ తన వైపు నుంచి ఇవ్వాల్సిన ఆఫర్లను ఇప్పటికే యూఎస్ ముందుంచింది. భారత్ వైపు నుంచి ప్రక్రియ పూర్తయింది. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది యూఎస్’ అని ఒక సీనియర్ అధికారి స్పష్టం చేశారు. వాణిజ్య ఒప్పందం అసలు వివరాలు యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR), చర్చల బృందాలకు మాత్రమే తెలుసని పేర్కొన్నారు.
భారత్-ఈయూ ఒప్పందం కీలకం
అమెరికాతో చర్చలు జరుగుతున్నప్పటికీ ఈయూతో ఒప్పందం వేగవంతం కావడం వెనుక బలమైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తులు, ఆటోమొబైల్స్, ప్రీమియం వస్తువులపై భారత్ సుంకాల తగ్గింపునకు అంగీకరించింది. ప్రతిగా భారతీయ వస్త్రాలు, తోలు వస్తువులు, ఇంజినీరింగ్ ఉత్పత్తుల వంటి కార్మిక ఆధారిత రంగాలకు ఈయూ మార్కెట్‌లో భారీ రాయితీలు లభించనున్నాయి. ఇది దేశంలో ఉపాధి కల్పనకు ఊతమిస్తుంది.
వ్యూహాత్మకంగా..
అమెరికాతో ఉన్న అనిశ్చితి వల్లే ఈయూతో భారత్ వేగంగా ఒప్పందం చేసుకుంటోందనే వాదనలను అధికారులు తోసిపుచ్చారు. ‘ప్రతి చర్చకు దాని సొంత పథం, వ్యూహాత్మక హేతుబద్ధత ఉంటుంది. ఈయూ చర్చలు అమెరికా చర్చల కంటే చాలా ముందు నుంచే జరుగుతున్నాయి. కాబట్టి ఇది సహజమైన పరిణామమే తప్పా ఒక దేశంపై ఆధారపడి తీసుకున్న నిర్ణయం కాదు’ అని అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు!


