భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం ఖరారైంది. భారత్–యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సాగిన చర్చలు విజయవంతంగా ముగిశాయని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ సోమవారం వెల్లడించారు. ఈ ఒప్పందాన్ని జనవరి 27న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇది “సమతుల్యమైనదీ, ముందుచూపుతో కూడినదీ” అని పేర్కొన్న ఆయన, ఈయూతో భారతదేశ ఆర్థిక ఏకీకరణను మరింత బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ఈ ఒప్పందం వచ్చే ఏడాది ఏదో ఒక సమయంలో అమల్లోకి వచ్చే అవకాశముందని అగర్వాల్ తెలిపారు. ఒప్పంద పాఠ్యానికి సంబంధించిన చట్టపరమైన పరిశీలన (లీగల్ స్క్రబ్బింగ్)కు సుమారు 5–6 నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత అధికారికంగా సంతకాలు జరుగుతాయని చెప్పారు. “చర్చలు పూర్తయ్యాయి. ఒప్పందం ఖరారైంది. ఇది రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది” అని ఆయన అన్నారు.
కాగా, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సోమవారం జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


