భారత్, యురోపియన్ యూనియన్‌ల ట్రేడ్ డీల్ ఓ కొలిక్కి రావడం అమెరికాకు ఏమాత్రం నచ్చనట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ అండ్ టీం వరుస ప్రకటనలు ఇస్తోంది. తాజాగా.. అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా యూరప్ దేశాలు తమపై యుద్ధానికి తామే నిధులు సమకూర్చుకుంటున్నాయని వ్యాఖ్యానించారాయన.
‘‘ఈ ఒప్పందం ద్వారా యూరప్ తన భద్రతను తానే బలహీనపర్చుకుంటోంది. ఉదాహరణకు.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 25 శాతం సుంకాలను విధించాం. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చూశారా?. ఇప్పుడు యూరోపియన్లు భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడ ఓ విషయం గమనించాలి.
రష్యన్ చమురు తొలుత భారత్‌కు వెళ్తోంది. అక్కడి నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు బయటకు వస్తున్నాయి. వాటిని యూరప్ ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా తమ తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నారు’’ అంటూ బెసెంట్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో వాణిజ్యం, ఇంధన రంగం మళ్లీ అమెరికా–యూరప్ సంబంధాల్లో ప్రధాన ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం ఉన్నట్లు సంకేతాలు అందించారాయన.
మరోవైపు.. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు బెసెంట్ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ‘‘రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించుకుంది. అది భారీ విజయం. చమురు విషయంలో ఇప్పటికీ టారిఫ్‌లు అమల్లో ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉందని అనుకుంటున్నాను’’ అని సుంకాల తొలగింపు గురించి పరోక్షంగా చెప్పారాయన.
తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోనే ఉక్రెయిన్- రష్యా యుద్ధానికి తెరపడుతుందని బెసెంట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి పరిష్కారం చూపేందుకు ట్రంప్ కృషి చేస్తున్నారని, ఈ వ్యవహారంలో యూరప్ దేశాల కంటే అమెరికానే చాలా పెద్ద త్యాగాలు చేసిందని చెప్పారు. అయితే అంతపెద్ద త్యాగాలు ఏంటన్నది మాత్రం ఆయన ప్రస్తావించలేదు.
డీల్ సెట్
2007లో ప్రారంభమైన చర్చలు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ముగింపు దశకు చేరుకున్నాయి. ఈయూతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు విజయవంతంగా ముగిశాయని.. ఈమేరకు ఒప్పందం ఖరారైనట్లు భారత వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ఆదివారం వెల్లడించారు. భారత్ కోణం నుంచి ఈ ఒప్పందం సమతుల్యంగా, దూరదృష్టితో కూడి ఉందని చెప్పారు. ఇరువైపులా వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు, ఆర్థిక సంబంధాల బలోపేతానికి ఇది దోహదపడుతుందన్నారు.
ఈ ఒప్పందం ద్వారా భారత టెక్స్ట్‌టైల్స్, కెమికల్స్, రత్నాలు, ఆభరణాలు, ఎలక్ట్రికల్ యంత్రాలు, లెదర్ వస్తువులు, ఆటోమొబైల్స్, ఫుట్‌వేర్ వంటి రంగాలకు డ్యూటీ-ఫ్రీ లభించనుంది. ఒక రకంగా ఈయూతో ట్రేడ్ డీల్.. ఆర్థిక పరంగా ఇది భారత్‌కు ఒక పెద్ద విజయంగా భావించవచ్చు. రష్యా చమురు దిగుమతులు తగ్గుతున్నప్పటికీ(డిసెంబర్‌లో భారత్ రష్యా చమురు దిగుమతులు రెండు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరాయి. అదే సమయంలో, OPEC దేశాల నుండి చమురు దిగుమతులు 11 నెలల గరిష్ట స్థాయికి పెరిగాయి).. యూరప్‌తో వాణిజ్య ఒప్పందం ద్వారా కొత్త మార్కెట్లు తెరుచుకోనున్నాయి. ఇది భారత్ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచగలదు.


