కెనడాకు ట్రంప్ హెచ్చరికలు
కార్నీ తీరుపై తీవ్ర విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహాగ్ని తాజాగా కెనడా వైపు మళ్లింది. చైనాతో వాణిజ్య ఒప్పందం విషయంలో మొండిగా ముందుకెళ్తే కెనడాపై ఏకంగా 100 శాతం టారిఫ్‌లు విధిస్తామని శనివారం ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వాటి మధ్య ఒప్పందం కుదిరితే ఆ మరుక్షణమే సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్‌సోషల్‌లో ఈ మేరకు పోస్టు పెట్టారు.
కెనడా ప్రధాని మార్క్ కార్నీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చైనా వస్తువులు, ఉత్పత్తులను అమెరికాలో గుమ్మరించేందుకు ఆయన కెనడాను వేదికగా మార్చజూస్తున్నారని ఆరోపించారు. ‘‘కార్నీ ఉద్దేశం అదే అయితే గనక ఆయన చాలా పొరబడుతున్నారు. అలా జరిగేందుకు నేనెప్పటికీ అనుమతించబోను’’అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కెనడా ప్రధాని కార్యాలయం అధికారికంగా స్పందించలేదు. ట్రంప్ తన పోస్టులో కార్నీని ‘గవర్నర్’గా సంబోధించడం విశేషం.
అమెరికాలో కెనడా 51వ రాష్ట్రంగా విలీనం కావాలని ఆయన పలుమార్లు సూచించడం తెలిసిందే. ఈ సంబోధన తాలూకు ఉద్దేశం కూడా అదేనంటున్నారు. ట్రంప్, కార్నీ నడుమ కొంతకాలంగా మాటల యుద్ధం సాగుతోంది. ట్రంప్‌వి ఏకపక్ష పోకడలంటూ ఇటీవల కార్నీ దుయ్యబట్టారు. దాంతో చిర్రెత్తుకొచి్చన ట్రంప్, అసలు కెనడా బతుకుతున్నదే అమెరికా దయాదాక్షిణ్యాల మీద అంటూ దావోస్ వేదికగా ఎద్దేవా చేశారు.
దీనిపై కార్నీ స్పందిస్తూ, నియంతృత్వ పోకడలకు తల వంచకుండా ప్రపంచానికి కెనడా ఒక ఉదాహరణగా నిలుస్తుందంటూ బదులిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో గాజా పునర్నిర్మాణానికి తలపెట్టిన శాంతిమండలిలో చేరేందుకు కెనడాకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు. చైనా తన విద్యుత్ వాహనాలపై టారిఫ్‌లను తగ్గించేలా కెనడాతో కొంతకాలంగా బేరసారాలాడుతోంది.
ప్రతిగా కెనడా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపుకు సంసిద్ధత వెలిబుచ్చింది. ఈ మేరకు ఒప్పందం దిశగా వాటి మధ్య ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. దీన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ ఒప్పందం కుదుర్చుకుంటే కెనడాను ఆర్థికంగా, సామాజికంగా చైనా పూర్తిగా కబళించేస్తుందని ఇటీవలే ఆయన హెచ్చరించారు. అమెరికా ప్రతిపాదిత గోల్డెన్‌డోమ్ రక్షణ ఛత్రంలోకి వచ్చేందుకు కెనడా నిరాకరించడంపై కూడా ట్రంప్ తీవ్ర అసహనం వెలిబుచ్చారు.


