న్యూఢిల్లీ: భారతదేశం - యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) తుది దశకు చేరుకుంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఈ చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈయూ అగ్రనేతలు ముఖ్య అతిథులుగా విచ్చేసిన నేపథ్యంలో, ఈ దౌత్యపరమైన సాన్నిహిత్యం ఇప్పుడు వాణిజ్యపరమైన శక్తిగా రూపాంతరం చెందబోతోంది. ఈ ఒప్పందం ఖరారైతే, దశాబ్ద కాలపు చర్చలకు ముగింపు పలకడమే కాకుండా, రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య మార్కెట్ల మధ్య సరికొత్త అధ్యాయం మొదలుకానుంది.
రూ. 11 లక్షల కోట్ల వాణిజ్య లక్ష్యం
భారత్, ఈయూ దేశాల మధ్య ఆర్థిక పరంగా సంబంధాలు ఇప్పటికే ఎంతో బలంగా ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వస్తు వ్యాపారం సుమారు 136 బిలియన్ డాలర్లకు (దాదాపు ₹11.3 లక్షల కోట్లు) చేరింది. ప్రస్తుతం ఈయూ.. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. ఈ తాజా ఒప్పందం ద్వారా సుంకాలను తగ్గించడం, నిబంధనలను సరళీకృతం చేయడం, సేవల మార్కెట్‌ను ఇరువైపులా విస్తృతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫలితంగా 45 కోట్ల మంది వినియోగదారులున్న ఐరోపా మార్కెట్ భారతీయ ఉత్పత్తులకు మరింత చేరువకానుంది.
ప్రపంచ అనిశ్చితిలో వ్యూహాత్మక అడుగు
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక రంగం తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన టారిఫ్ విధానాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య భారత్-ఈయూ ఒప్పందం అంతర్జాతీయ సమాజానికి ఒక కీలక సందేశాన్ని పంపనుంది. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన వాణిజ్యానికి తాము కట్టుబడి ఉన్నామని ఈ రెండు శక్తులు నిరూపిస్తున్నాయి. ఈ ఒప్పదం డిఫెన్స్, క్లీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, స్పేస్ రంగాల్లో భారత్-ఈయూ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక బంధానికి నిదర్శనం కానుంది.


