కేంద్ర బడ్జెట్ 2026-27 విడుదలకు సమయం దగ్గరపడుతున్న వేళ పారిశ్రామిక వర్గాల అంచనాలు, ఆశలపై కేపీఎంజీ ఇండియా సర్వే విడుదల చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న నూతన ఆదాయపు పన్ను చట్టం నేపథ్యంలో పన్ను విధానాల సరళీకరణ, ప్రోత్సాహకాలపై స్టేక్‌హోల్డర్లు ఏమనుకుంటున్నారో ఈ ప్రీ-బడ్జెట్ సర్వే స్పష్టం చేస్తోంది.
జనవరి 2026లో నిర్వహించిన ఈ సర్వేలో ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్నాలజీ, ఫార్మా, హెల్త్‌కేర్ వంటి కీలక రంగాలకు చెందిన 100 మందికి పైగా పాల్గొన్నారు. వీరి అభిప్రాయాల ప్రకారం బడ్జెట్ నుంచి ఆశిస్తున్న ప్రధాన మార్పులు ఇవే..
పన్ను ప్రోత్సాహకాల పునరుద్ధరణ
తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు గతంలో ఉన్న తక్కువ పన్ను రేటు విధానాన్ని మళ్లీ తీసుకురావాలని 34 శాతం మంది కోరుతుండగా, దాదాపు 50 శాతం మంది నిర్దిష్ట రంగాల వారీగా ప్రత్యేక పన్ను ప్రోత్సాహకాలు ఉండాలని అభిప్రాయపడ్డారు.
కొత్త ఐటీ చట్టం - సరళీకరణ
కొత్త చట్టం దిశగా అడుగులు పడుతున్నా కొన్ని అంశాల్లో మరింత స్పష్టత, సరళీకరణ అవసరమని సర్వే నొక్కి చెప్పింది. అందులో..
టీడీఎస్/టీసీఎస్ నిబంధనల అమలులో సరళత.
క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధానంలో మార్పులు.
లిటిగేషన్ (న్యాయపరమైన వివాదాలు), అసెస్‌మెంట్ ప్రక్రియలో వేగం అవసరమనే అభిప్రాయాలున్నాయి.
స్టాండర్డ్ డిడక్షన్
మధ్యతరగతి, వేతన జీవులకు ఊరటనిచ్చేలా బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) పరిమితిని గణనీయంగా పెంచాలని 73 శాతం మంది కోరుతున్నారు.
జీఎస్టీ, ఇతర సంస్కరణలు
జీఎస్టీ ‘ఇన్వాయిస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’లో ఉన్న లోపాల వల్ల క్రెడిట్ నోట్ల మిస్‌మ్యాచ్‌లు పెరుగుతున్నాయని, వీటిని సరిదిద్దాలని 82 శాతం మంది కోరుతున్నారు.
ప్రస్తుత డిస్‌ప్యూట్ రిజల్యూషన్ ప్యానెల్ (DRP) వివాదాలను వేగంగా పరిష్కరించడంలో విఫలమవుతోందని సగం మంది ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ల (IFSC) కోసం దీర్ఘకాలిక నిబంధనలు కావాలని 51 శాతం మంది కోరారు.
‘పరిశ్రమ వర్గాలు కేవలం పన్ను తగ్గింపులనే కాకుండా పారదర్శక వివాద పరిష్కార వ్యవస్థను, పన్ను నిబంధనల పునర్వ్యవస్థీకరణను కోరుకుంటున్నాయి. 2026 ఏప్రిల్ నుంచి రానున్న కొత్త చట్టం ఈ అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి’ అని కేపీఎంజీ ఇండియా, ట్యాక్స్ హెడ్ సునీల్ బడాలా అన్నారు.
ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు!


