బ్రిక్స్‌ దేశాల డిజిటల్ కరెన్సీలు అనుసంధానం? | BRICS digital currency integration RBI proposal 2026 | Sakshi
Sakshi News home page

బ్రిక్స్‌ దేశాల డిజిటల్ కరెన్సీలు అనుసంధానం?

Jan 20 2026 11:12 AM | Updated on Jan 20 2026 11:26 AM

BRICS digital currency integration RBI proposal 2026

అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటక రంగాల్లో చెల్లింపుల ప్రక్రియను మరింత సరళతరం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక అడుగు వేసింది. బ్రిక్స్‌(BRICS) కూటమిలోని సభ్య దేశాల అధికారిక డిజిటల్ కరెన్సీలను (CBDC) పరస్పరం అనుసంధానించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. ఈ చర్య ద్వారా అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలర్‌పై ఉన్న ఆధిపత్యాన్ని తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

2026 బ్రిక్స్‌ సదస్సు అజెండాలో..

2026లో జరగనున్న BRICS సదస్సులో ఈ ప్రతిపాదనను ప్రధాన అజెండాగా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్‌ సదస్సులో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపడితే సభ్య దేశాల డిజిటల్ కరెన్సీల అనుసంధానంపై తొలిసారిగా అధికారిక ప్రతిపాదన వెలువడే అవకాశం ఉంది.

డీ-డాలరైజేషన్ దిశగా అడుగులు..

బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ఈ బ్రిక్స్‌ కూటమి ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థల వైపు మొగ్గు చూపడంపై అమెరికా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కూటమిని అమెరికా వ్యతిరేకంగా అభివర్ణిస్తూ సభ్య దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని గతంలోనే హెచ్చరించారు. అయితే, భారత్ మాత్రం రూపాయి వాడకాన్ని విస్తరించే ప్రయత్నాలు డీ-డాలరైజేషన్ (డాలర్ వినియోగాన్ని తగ్గించడం) లక్ష్యంగా చేస్తున్నవి కావని, కేవలం వాణిజ్య సౌలభ్యం కోసమేనని స్పష్టం చేస్తోంది.

2025 రియో డిక్లరేషన్‌కు కొనసాగింపు

2025లో బ్రెజిల్‌లోని రియో డి-జెనీరోలో జరిగిన బ్రిక్స్‌ సదస్సులో సభ్య దేశాల చెల్లింపు వ్యవస్థల మధ్య ‘ఇంటరాపరబిలిటీ’ (పరస్పర అనుకూలత) పెంచాలని నిర్ణయించారు. తాజా ఆర్‌బీఐ ప్రతిపాదన ఆ నిర్ణయానికి కొనసాగింపుగా కనిపిస్తోంది. ప్రస్తుతం బ్రిక్స్‌ దేశాల్లో ఏదీ పూర్తిస్థాయిలో డిజిటల్ కరెన్సీని విడుదల చేయనప్పటికీ ఐదు ప్రధాన దేశాలు పైలట్ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి.

భారత ‘ఈ-రూపీ’ పురోగతి

భారత్ తన డిజిటల్ కరెన్సీ రంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. డిసెంబర్ 2022లో ప్రారంభమైన ‘ఈ-రూపీ’కి ప్రస్తుతం 70 లక్షల మంది రిటైల్ వినియోగదారులు ఉన్నారు. ఆఫ్‌లైన్ చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీల కోసం ఆర్‌బీఐ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. మరోవైపు చైనా కూడా తన డిజిటల్ యువాన్ అంతర్జాతీయ వినియోగాన్ని పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

సవాళ్లు..

బ్రిక్స్‌ దేశాల డిజిటల్ కరెన్సీల అనుసంధానం అంత సులభం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశాల మధ్య ఉండే వాణిజ్య అసమతుల్యతలు, సాంకేతిక పరమైన భిన్నత్వాలు, పాలనా నియమాలను ఏకీకృతం చేయడం వంటి అంశాలపై లోతైన చర్చలు జరగాల్సి ఉంది. ఈ ప్రతిపాదనపై ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర సభ్య దేశాల కేంద్ర బ్యాంకులు ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదని గమనించాలి.

ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement