ఈ-కామర్స్ సర్వీసులు అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్ తన వార్షిక పనితీరు సమీక్ష తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాల్‌మార్ట్ ఆధ్వర్యంలోని ఈ సంస్థ త్వరలో రానున్న పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ఉద్యోగ కోతలపై ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా స్పందిస్తూ, ఇది ఒక సాధారణ ప్రక్రియ అని స్పష్టం చేసింది. ‘ఫ్లిప్‌కార్ట్‌లో స్పష్టంగా నిర్వచించిన అంచనాలకు అనుగుణంగా రెగ్యులర్ పనితీరు సమీక్షలను నిర్వహిస్తాం. ఈ ప్రక్రియలో భాగంగా కొద్ది శాతం మంది ఉద్యోగులు సంస్థ నుంచి బయటకు వెళ్లవచ్చు. ఇందులో ప్రభావితమైన ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తున్నాం’ అని సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
ఐపీఓ లక్ష్యంగా..
2025 డిసెంబర్‌లో ఫ్లిప్‌కార్ట్ తన అధికారిక చిరునామాను చట్టపరంగా సింగపూర్ నుంచి భారతదేశానికి మార్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) నుంచి అనుమతి పొందింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావాలనే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యాషన్, ఆరోగ్యం, లాజిస్టిక్స్ వంటి వివిధ విభాగాలను సరళీకృతం చేస్తూ సింగపూర్‌కు చెందిన ఎనిమిది సంస్థలను ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం చేసింది.
నష్టాలున్నా.. పెరిగిన ఆదాయం
బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ‘టోఫ్లర్’ డేటా ప్రకారం ఫ్లిప్‌కార్ట్ ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.5,189 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అయితే కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 17.3 శాతం వృద్ధి చెంది రూ.82,787.3 కోట్లకు చేరింది (గత ఏడాది ఇది రూ.70,541.9 కోట్లు). మొత్తం ఖర్చులు 17.4 శాతం పెరిగి రూ.88,121.4 కోట్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా స్టాక్ కొనుగోళ్ల వ్యయం పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఇదీ చదవండి: రష్యా చమురు కొనుగోలుకు యూఎస్ ఓకే


