ఆఫర్స్ ఎప్పుడెప్పడు వస్తాయా?, నచ్చిన వస్తువులను తక్కువ ధరలో ఎప్పుడు కొనేద్దామా.. అని చాలామంది ఎదురు చూస్తుంటారు. మన దేశంలో కొన్ని సంస్థలు సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలకు ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటిస్తాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది బ్లాక్‌ఫ్రైడే ఆఫర్స్ కోసం ఎదురు చూస్తారు. అలాంటి బ్లాక్‌ఫ్రైడే నవంబర్ 28న వస్తోంది. ఇంతకీ ఈ బ్లాక్‌ఫ్రైడే ఎలా వచ్చింది? నిజంగానే అనుకున్నంత డిస్కౌంట్స్ లభిస్తాయా?.. అనే ఆసక్తికరమైన వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
బ్లాక్‌ఫ్రైడే ఎలా వచ్చిందంటే?
ప్రతి ఏటా నవంబర్ చివరి వారంలో వచ్చే శుక్రవారాన్నే బ్లాక్‌ఫ్రైడేగా పిలుస్తారు. అమెరికాలో అయితే.. బ్లాక్‌ఫ్రైడే ముందు రోజును థాంక్స్ గివింగ్ డే పేరుతో సెలబ్రేట్స్ చేసుకుంటారు. బ్లాక్‌ఫ్రైడే ఎలా వచ్చింది? అనటానికి చాలా సంఘటనలను ఉదాహరణలుగా చెబుతారు.
నిజానికి బ్లాక్‌ఫ్రైడే అనే పదానికి.. షాపింగ్‌కు సంబంధమే లేదు. 1969 ఆర్ధిక సంక్షోభం సమయంలో ఒక శుక్రవారం రోజు బంగారం ధరలు భారీ పడిపోవడంతో.. దాన్నే బ్లాక్‌ఫ్రైడేగా పిలుచుకున్నారు.
20వ శతాబ్దంలో.. ఒకసారి అమెరికాలో కార్మికుల సెలవు రోజుల తరువాత విధులకు లేటుగా వెళ్లారు.. దీన్ని కూడా బ్లాక్‌ఫ్రైడే అని పిలిచారు.
ఫిలడెల్ఫియాలో శుక్రవారం రోజు షాపింగ్ వల్ల రద్దీ ఎక్కువగా ఏర్పడటంతో.. పోలీసులు దాన్ని బ్లాక్‌ఫ్రైడేగా పిలిచారు. ఆ తరువాత బ్లాక్‌ఫ్రైడే అనేది ఆన్‌లైన్ కొనుగోళ్ళకు.. డిస్కౌంట్లకు పర్యాయపదంగా మారిపోయింది.
శుక్రవారం రోజు మొదలయ్యే వ్యాపారం.. వారాంతంలో కూడా బాగా సాగుతుంది. ఇలా బ్లాక్‌ఫ్రైడేను వ్యాపారానికి ఆపాదించేసారు. ఆ తరువాత సోషల్ మీడియా / ఇంటర్‌నెట్ కారణంగా.. బ్లాక్‌ఫ్రైడే అనే పదం ప్రపంచానికి పరిచయమైంది.
2025 బ్లాక్‌ఫ్రైడే సేల్
2023 బ్లాక్‌ఫ్రైడే సేల్స్ సమయంలో ప్రపంచంలోని వినియోగదారులు ఏకంగా రూ. 75,000 కోట్లకంటే ఎక్కువ విలువైన షాపింగ్, 2024లో ఇది రూ. లక్ష కోట్లకు చేరింది. అయితే ఈ ఏడాది బ్లాక్‌ఫ్రైడే సేల్స్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా.. రూ.1.50 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా.
గొప్ప ఆఫర్స్ ఉంటాయా?
మంచి ఆఫర్స్ ఉంటాయా? అనే విషయాన్ని పరిశీలిస్తే.. బ్లాక్‌ఫ్రైడే సేల్స్ సమయంలో ప్రకటించే ఏడు ఆఫర్లతో ఒకటి మాత్రమే నిజమైందని బ్రెటర్ వినియోగదారుల బృందం 2022లో వెల్లడించింది. కాబట్టి బ్లాక్‌ఫ్రైడే ఆఫర్స్ కంటే క్రిస్మస్ షాపింగ్ ఉత్తమం అని తెలిపారు.
కొన్ని దేశాల్లో అయితే బ్లాక్‌ఫ్రైడే వస్తోందని ముందుగానే ధరలను పెంచేసి.. ఆ రోజు తగ్గించినట్లు ప్రకటిస్తాయి. దీనిని కొందరు బ్లాక్ ఫ్రాడ్ అని విమర్శించారు. కాబట్టి బ్లాక్‌ఫ్రైడే సమయంలో ఆఫర్స్ ఉపయోగించే ఉత్పత్తులను కొనాలని చూసేవారు తప్పకుండా జాగ్రత్తగా పరిశీలించాలి. స్కామర్లు కూడా దీనిని అదనుగా చూసుకుని.. మోసాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు ఆదమరిస్తే మోసపోవడం ఖాయం.
ఇదీ చదవండి: జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు


