
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు 1–4 శాతం పెరగొచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. డీలర్ల వద్ద అధిక నిల్వలు, బేస్ ఎఫెక్ట్‌ల కారణంగా అవుట్‌లుక్ వృద్ధిని పరిమితం చేసినట్లు రేటింగ్ సంస్థ తెలిపింది. అయితే ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చర్లు)లు కొత్త మోడళ్ల ఆవిష్కరణ, జీఎస్‌టీ రేట్ల తగ్గింపు అవకాశాలు కొన్ని ప్రత్యేక విభాగాల్లో డిమాండ్‌కు తోడ్పడతాయని పేర్కొంది.
‘‘పండుగ సీజన్‌కు ముందు ఓఈఎంలు ఇన్వెంటరీ నిల్వలను పెంచుకోవడంతో నెల వారీ ప్రాతిపదికన జూలై హోల్‌సేల్ అమ్మకాల్లో 8.9 శాతం వృద్ధి నమోదైంది. అయితే వార్షిక ప్రాతిపదికన ఫ్లాటుగా 3.4 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. నెలవారీ ప్రాతిపదికన రిటైల్ అమ్మకాలు 10.4% వృద్ధి నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదకన స్వల్పంగా 0.8% క్షీణత నమోదైంది. ప్యాసింజర్ వాహన విక్రయాల్లో ఎస్‌యూవీలు 65–66% వాటా సాధించాయి. సమీప భవిష్యత్తులో యుటిలిటీ వాహనాలు పరిశ్రమ వృద్ధికి కీలక ప్రచోదకాలుగా మారాయి’’ అని ఇక్రా వివరించింది.