ఇప్పటికే టెమాసెక్, అల్ఫా వేవ్, ఐహెచ్‌సీకి పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీ స్నాక్స్ దిగ్గజం హల్దీరామ్స్‌లో తాజాగా కన్జూమర్ ఫోకస్‌డ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కేటర్‌టన్ పార్ట్‌నర్స్ వాటా కొనుగోలు చేసింది. అంతేకాకుండా హల్దీరామ్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నట్లు ఎల్.కేటర్‌టన్ తాజాగా వెల్లడించింది. అయితే పెట్టుబడి విలువ లేదా వాటా సంబంధ వివరాలు పేర్కొనలేదు.
దేశీయంగా నాయకత్వస్థాయిలో ఉన్న హల్దీరామ్స్ అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు వీలుగా చేతులు కలిపినట్లు తెలియజేసింది. కేటర్‌టన్ సుమారు 39 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ పెట్టుబడులను నిర్వహిస్తోంది. వెరసి ఇప్పటికే హల్దీరామ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన పలు అంతర్జాతీయ దిగ్గజాల సరసన చేరింది.
ప్యాకేజ్‌డ్ స్నాక్స్, స్వీట్స్‌సహా రెస్టారెంట్లను నిర్వహించే హల్దీరామ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు చేపట్టే టెమాసెక్(సింగపూర్ కేంద్రం), అల్ఫా వేవ్ గ్లోబల్, ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ(ఐహెచ్‌సీ) ఈ ఏడాది మొదట్లో వాటాలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
వివరాలు వెల్లడికానప్పటికీ 10 బిలియన్ డాలర్ల(రూ. 85,000 కోట్లు) విలువలో హల్దీరామ్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా ఎల్.కేటర్‌టన్‌కు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ మాజీ ఎండీ సంజీవ్ మెహతా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కంపెనీ ఇప్పటికే ఫామ్‌లీ, ఫెరారా క్యాండీ, కెటెల్ ఫుడ్స్, లిటిల్ మూన్స్, ప్లమ్ ఆర్గానిక్స్ తదితరాలలో పెట్టుబడులు చేపట్టింది.


