బజాజ్ ఆటో చేతికి కేటీఎమ్
న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో తాజాగా ఆ్రస్టియన్ బైక్ కంపెనీ కేటీఎమ్‌లో మెజారిటీ వాటా సొంతం చేసుకుంది. 80 కోట్ల యూరోల(రూ. 7,765 కోట్లు) విలువైన ఒప్పందానికి యూరోపియన్ నియంత్రణ సంస్థల నుంచి అనుమతి పొందడం ద్వారా అదనపు వాటాను కొనుగోలు చేసినట్లు బజాజ్ ఆటో తెలియజేసింది.
దీంతో పియరర్ బజాజ్ ఏజీ(పీబీఏజీ) పేరు బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ఏజీగా మార్పు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. అంతేకాకుండా జ్యూరిక్, వియన్నాలలో లిస్టయిన కేటీఎమ్ ఏజీ హోల్డింగ్ సంస్థ పియరర్ మొబిలిటీ ఏజీ(పీఎంఏజీ) పేరును బజాజ్ మొబిలిటీ ఏజీగా సవరిస్తున్నట్లు పేర్కొంది. అనుబంధ సంస్థ ద్వారా కేటీఎమ్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకోనున్నట్లు ఈ ఏడాది మే నెలలో బజాజ్ ఆటో ప్రకటించిన సంగతి తెలిసిందే.
వాటాల వివరాలివీ
తాజా లావాదేవీకి ముందు సహచర సంస్థ పీబీఏజీ(ఆ్రస్టియా)లో బీఏఐహెచ్‌బీవీ ద్వారా బజాజ్ ఆటో 49.9 శాతం వాటాను కలిగి ఉంది. పీబీఏజీలో మిగిలిన నియంత్రిత వాటా స్టెఫాన్ పియరర్ కంపెనీ పియరర్ ఇండస్ట్రీస్ ఏజీ చేతిలో ఉంది. అనుబంధ కంపెనీ పీఎంఏజీలో పీబీఏజీ దాదాపు 75 శాతం వాటా కలిగి ఉంది. వెరసి పీఎంఏజీ, కేటీఎమ్‌లో బజాజ్ ఆటో 37.5 శాతం వాటా పొందింది. అయితే తాజా లావాదేవీ తదుపరి పీబీఏజీలో బీఏఐహెచ్ వాటా 100 శాతానికి చేరగా.. పీఎంఏజీ, కేటీఎమ్‌లో 74.9 శాతం వాటాను పీబీఏజీ పొందినట్లు బజాజ్ ఆటో వివరించింది.


