హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన లీ టోంగ్ గ్రూప్‌లో భాగమైన రీటెక్ ఎన్విరోటెక్‌లో మెజారిటీ వాటాలను కొనుగోలు చేసినట్లు హైదరాబాద్‌కి చెందిన అంకుర సంస్థ బ్లాక్ గోల్డ్ రీసైక్లింగ్ వెల్లడించింది. పర్యావరణహితమైన విధంగా లిథియం అయాన్ బ్యాటరీలు, ప్లాస్టిక్స్, సోలార్ ప్యానెళ్లు మొదలైన వాటి రీసైక్లింగ్ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థ వ్యవస్థాపకుడు ప్రభు రామ్ తెలిపారు.
ఈ డీల్‌లో భాగంగా రీటెక్ ఎన్రోవ టెక్ సీఈవో పంకజ్ తిర్మన్‌వార్.. బ్లాక్ గోల్డ్‌లో సహ వ్యవస్థాపకుడిగా, బోర్డు సభ్యుడిగా చేరతారని పేర్కొన్నారు. వ్యర్ధాలను విలువైన వనరులుగా మార్చే అధునాతన సాంకేతికతలపై తాము గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించారు.
ఏఐ హబ్‌ని విస్తరించిన మెల్ట్‌వాటర్
మీడియా, కన్జూమర్ ఇంటెలిజెన్స్ సంస్థ మెల్ట్‌వాటర్, హైదరాబాద్‌లోని తమ ఏఐ హబ్‌ని మరింతగా విస్తరించింది. ఈ కార్యాలయం వైశాల్యం దాదాపు 14,000 చ.అ.గా ఉంటుంది. ఇందులో 60 మంది ఇంజినీర్ల ఆర్‌అండ్‌డీ (పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు) బృందం, కొత్త తరం ఏఐ సొల్యూషన్స్‌ను రూపొందించడంపై పని చేస్తోందని సంస్థ తెలిపింది.
హైదరాబాద్‌లోని ఐఐటీ, బిట్స్ పిలానీ, ట్రిపుల్‌ఐటీలాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నుంచి వీరిని రిక్రూట్ చేసుకున్నట్లు వివరించింది. 2026 నాటికి ఇంజినీర్ల సంఖ్యను 150కి పెంచుకోనున్నట్లు కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆదిత్య జామీ తెలిపారు. భారత్‌లో రిజర్వ్ బ్యాంక్, ఎయిరిండియా, టాటా గ్రూప్, అమెజాన్ ఇండియాలాంటి దిగ్గజాలకు సర్వీసులు అందిస్తున్నట్లు వివరించారు.


