మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్.. భారతదేశంలో విక్రయిస్తున్న గ్రాండ్ విటారాకు రీకాల్ జారీ చేసింది. ఇంతకీ కంపెనీ రీకాల్ ఎందుకు జారీ చేసింది, దీని ప్రభావం ఎన్ని కార్లపై పడింది? అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.
'ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్, వార్నింగ్ సిస్టం'లలో ఏర్పడిన సమస్యను పరిష్కరించడానికి.. మారుతి సుజుకి తన గ్రాండ్ విటారాకు రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య వల్ల ఫ్యూయెల్ ట్యాంక్‌లో ఎంత ఇంధనం ఉందనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోలేరు. తద్వారా ఎక్కడైనా ఇంధనం పూర్తిగా అయిపోతే.. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రభావం 2024 డిసెంబర్ 9 నుంచి 2025 ఏప్రిల్ 29 మధ్య తయారైన 39,506 కార్లపై ఉంటుంది.
గ్రాండ్ విటారా యజమానులు.. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి అధీకృత మారుతి సుజుకి సర్వీస్ సెంటర్‌లను సందర్శించాలి. దీనికోసం వారు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇదీ చదవండి: పిల్లల కోసమే ఈ కారు: డ్రైవర్ అవసరం లేదు
మారుతి సుజుకి గ్రాండ్ విటారా భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హైబ్రిడ్ కార్లలో ఒకటి. దీని ధరలు రూ. 10.77 లక్షల నుంచి రూ. 19.72 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది ఆల్ వీల్ డ్రైవ్ ఎంపికలో కూడా లభిస్తుంది.


