బాలల కమిషన్ పాలకులఎంపికకు ఇంటర్వ్యూల తేదీలపై కసరత్తు
చైర్మన్, సభ్యుల పదవులకు మాజీ ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతల దరఖాస్తు
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధమైన ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నియామకానికి సంబంధించిన ఇంటర్వ్యూల నిర్వహణకు తర్జనభర్జన సాగుతూనే ఉంది. ఇప్పటికే 3సార్లు నోటిఫికేషన్ల రద్దు, మూడుసార్లు ఇంటర్వ్యూల వాయిదాలతో 8 నెలలు గడుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ తీరుతో రాజ్యాంగబద్ధమైన కమిషన్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారుతోందనే విమర్శలు వినవస్తున్నాయి.
తాజాగా ఈ నెల 3 నుంచి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ముందురోజు రాత్రి రద్దుచేసింది. దీంతో మళ్లీ ఈ నెల 11, 12, 13 తేదీల్లో కమిషన్ నియామకానికి సంబంధించిన ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 11న మంత్రివర్గ సమావేశం ఉండటంతో 12, 13, 14 తేదీలైతే ఎలా ఉంటుందనే దానిపై చర్చలు సాగుతున్నాయి.
వైఎస్సార్‌సీపీ పాలనలో నియమించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 19తో ముగిసింది. కొత్తగా కమిషన్ నియామకానికి జూన్ 5న చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన తొలి నోటిఫికేషన్‌లో విద్యార్హత పీజీ ఉండాలనే నిబంధన పెట్టారు. దానిపై వివాదం నెలకొనడంతో 2 వారాల తరువాత విద్యార్హతను సవరించి డిగ్రీ చాలు అని మరో నోటిఫికేషన్ ఇచ్చారు.
ఆ తర్వాత మూడో నోటిఫికేషన్ ఆన్‌లైన్‌లో ఇచ్చి.. తరువాత దాని గడువు పొడించారు. వాస్తవానికి రాష్ట్ర విభజన తరువాత రెండుసార్లు చేపట్టిన కమిషన్ నియామకంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో డిగ్రీ విద్యార్హత అనే నిబంధన పెట్టలేదు. దీంతో 2017లో నియమించిన కమిషన్‌లో ఇద్దరు సభ్యులు, 2022లో కమిషన్‌లోని ఒకరికి డిగ్రీ విద్యార్హత కూడా లేకపోవడం గమనార్హం.
26 జిల్లాల సీడబ్ల్యూసీలకు నోటిఫికేషన్
ఏపీలోని 26 జిల్లాల బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ)ల నియామకాన్ని కూడా ప్రభుత్వం వాయిదాల పర్వంతోనే సాగదీస్తోంది. ఇప్పటికే 3 సార్లు నోటిఫికేషన్ రద్దుచేసిన ప్రభుత్వం.. తాజాగా మంగళవారం 26 జిల్లాల సీడబ్ల్యూసీల నియామకానికి నోటిఫికేషన్ జారీచేసింది. అర్హత కలిగినవారు ఈ నెల 22లోపు డబ్ల్యూడీసీడబ్ల్యూ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిచేసిన తరువాత మెయిల్ ద్వారా పంపాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
‘పదేళ్ల అనుభవం’పై ఫేక్ సర్టిఫికెట్లు
కమిషన్ చైర్మన్, ఆరుగురు సభ్యుల నియామకానికి 650 దరఖాస్తులు వచ్చాయి. వడపోత అనంతరం 359 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. బాలల న్యాయచట్టం ప్రకారం.. బాలలకు సంబంధించిన చట్టాల్లో అనుభవం, విద్య, ఆరోగ్యం, రక్షణ, సంరక్షణ, అభివృద్ధితోపాటు దివ్యాంగ బాలలు, బాలకార్మిక, బాల్య వివాహాలు, అణగారిన బాలలు, బాలల సైకాలజీ తదితర అంశాలలో పదేళ్లపాటు పనిచేసిన వారిని కమిషన్ చైర్మన్, సభ్యులుగా ఎంపిక చేయాల్సి ఉంది.
బాలల కోసం నిజంగా పనిచేస్తే వారి గుర్తింపు కార్డు, హాజరు, జీతాల వివరాలతోపాటు పనిచేసినకాలంలో ప్రెస్ క్లిప్పింగ్స్, ఫొటోల ఆధారాలుండాలి. కానీ.. ఇంటర్వ్యూలకు హాజరయ్యే చాలామంది.. పదేళ్లపాటు బాలల కోసం పనిచేసినట్లు ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు), ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి తీసుకున్న నకిలీ ధ్రువీకరణ పత్రాలు జతచేసినట్లు తెలిసింది. పలువురు టీడీపీ నాయకులు సైతం ఫేక్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసినట్టు తెలిసింది.


