'టిప్పర్‌ టెర్రర్‌' | Road accident near Mirjaguda, Chevella mandal, Rangareddy district | Sakshi
Sakshi News home page

ఉసురు తీసిన యమ 'కంకర'.. టిప్పర్‌ టెర్రర్‌

Nov 4 2025 5:04 AM | Updated on Nov 4 2025 5:04 AM

Road accident near Mirjaguda, Chevella mandal, Rangareddy district

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర ప్రమాదం

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్‌..

19 మంది మృతి

27 మందికి గాయాలు

మృతుల్లో 13 మంది మహిళలు, ఒక పసికందు

గుంతను తప్పించబోయి టిప్పర్‌ను కుడివైపునకు తిప్పిన డ్రైవర్‌ 

బస్సును ఢీకొట్టిన తర్వాత బస్సుపైకి ఒరిగిన కంకర టిప్పర్‌.. 60 టన్నుల కంకర కింద నలిగిపోయిన ప్రయాణికులు 

దుమ్ముతో ఊపిరాడక చాలామంది మృతి 

ప్రమాదంలో ఇరు వాహనాల డ్రైవర్లు మృతి 

టిప్పర్‌ అతివేగం, ఓవర్‌లోడ్‌.. రోడ్డుపై గుంతలే కారణాలు.. బస్సులోనూ పరిమితికి మించి 72 మంది ప్రయాణికులు  

ఉద్యోగానికి వెళ్లేవారు కొందరు.. కాలేజీకి వెళ్లేవారు మరికొందరు.. ఆస్పత్రికి వెళ్లేవారు ఇంకొందరు.. ఎవరి పనికోసం వారు బస్సెక్కారు.. తెల్లవారుజామున వారితోపాటు వారి ఆశలు, అవసరాలను కూడా మోసుకొని బయలుదేరిన ఆర్టీసీ బస్సు.. హైదరాబాద్‌ వైపు దూసుకుపోతోంది. తెలతెలవారుతుండగా టిప్పర్‌ రూపంలో మృత్యువు వాయువేగంతో ఎదురుగా దూసుకొచ్చింది. కంకర ఓవర్‌లోడుతో ఉన్న భారీ టిప్పర్‌ బస్సును బలంగా ఢీకొట్టడటంతోపాటు ఆ బస్సుపైనే ఒరిగిపోయింది. టిప్పర్‌లో ఉన్న 60 టన్నుల కంకర మొత్తం ఒక్కసారిగా బస్సుపై పడిపోయింది. దీంతో నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే 19 మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. కంకర కింద నలిగిపోతూ కొందరు ప్రయాణికులు చేసిన ఆర్తనాదాలతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది. సోమవారం ఉదయం 6.40 గంటల ప్రాంతంలో రంగారెడ్డి చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్‌– తాండూర్‌ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదం బాధితుల కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. అత్యంత భీతావహంగా ఉన్న ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. మృతుల్లో నెలల పసికందు కూడా ఉండటం, తల్లి తన బిడ్డను కాపాడేందుకు పొత్తిళ్లలో పొదువుకొని అలాగే ప్రాణాలు విడువటం అందరి హృదయాలను కలచివేసింది.

హృదయ విదారక దృశ్యాలు..
ప్రమాదానికి గురైన బస్సు సోమవారం తెల్లవారుజామున 4.59 గంటలకు తాండూరు బస్‌స్టాండు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. 72 మందితో కిక్కిరిన బస్సు ఉదయం 6.40 గంటలకు చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ టిప్పర్‌ పటాన్‌చెరు లక్డారం నుంచి కంకర లోడ్‌తో వికారాబాద్‌ దగ్గర్లోని చిట్టెంపల్లికి వెళ్తోంది. రోడ్డుపై ముందు ఉన్న గుంతను తప్పించబోయిన టిప్పర్‌ డ్రైవర్‌.. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. టిప్పర్‌ ఢీకొన్న వేగానికి బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. కంకర కింద పడి ప్రయాణికులు సజీవ సమాధి అయ్యారు. బస్సు సీట్ల కింద ఇరుక్కుపోయిన మరికొందరు ప్రయాణికులు కంకర కింద చిక్కుకుపోయారు. 

తాండూరు బస్టాండ్‌ నుంచి బయలుదేరుతున్న బస్సు 

క్షతగాత్రుల హాహాకారాలతో ఆ పరిసరాలు భీతావహంగా మారాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కంకర కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీశారు. వారిలో కొందరు అప్పటికే మృతి చెందగా.. కొన ఊపిరితో ఉన్న కొందరిని బతికించేందుకు సీపీఆర్‌ సహా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రమాదంలో బస్సు, లారీ డ్రైవర్లు ఇద్దరూ మరణించారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి, పీఎంఆర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు కండక్టర్‌ రాధ ఇచ్చిన ఫిర్యాదుతో (క్రైమ్‌ నెం. 723/2025యు/ఎస్‌ 106(1)బీఎన్‌ఎస్‌ చట్టం కింద) చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

పూర్తిగా ధ్వంసమైన బస్సు 

మృతులు వీరే..   
⇒ బోరబండ కార్మికనగర్‌కు చెందిన కల్పన (42), గున్నమ్మ (60), వికారాబాద్‌ జిల్లా దన్నారం తండాకు చెందిన హౌస్‌కీపింగ్‌ వర్కర్‌ తారీబాయి (44), యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన విద్యార్థిని గుర్రాల అఖిల (23), కర్ణాటక రాష్ట్రం గుల్బార్గాకు చెందిన బచ్చన్‌ నాగమణి (54), దౌల్తాబాద్‌ మండలం నీటూరుకు చెందిన రైతు మగళ్ల హన్మంతు (44), తాండూరు ఇంద్రానగర్‌ కాలనీకి చెందిన ఎండీ ఖాలీద్‌ (43), తాండూరు బృందావన్‌కాలనీకి చెందిన గృహిణి తబస్సుమ్‌ జాన్‌ (38), యాలాల మండలం పెర్కంపల్లికి చెందిన విద్యార్థులు ఈడిగ నందిని (22), సాయిప్రియ (18), తనూష (20), బషీరాబాద్‌ మండలం మంతాటికి చెందిన బస్సు డ్రైవర్‌ దస్తగిరి బాబా, తాండూరులోని వాల్మీకినగర్‌కు చెందిన కిష్టాపూర్‌ వెంకటమ్మ (21), యాలాల్‌ మండలం హాజీపూర్‌కు చెందిన లక్ష్మీ(40), కె.బందెప్ప (42), తాండూరు ఇంద్రానగర్‌కు చెందిన సెలా (20), తాండూరుకు చెందిన జహీరా ఫాతిమా (40 రోజుల బేబీ), తాండూరు గౌత్‌పూర్‌కు చెందిన విద్యార్థిని ముస్కన్‌ బేగం (21), టిప్పర్‌ డ్రైవర్‌ ఆకాష్‌కాంబ్లే (24).

ప్రమాదానికి కారణాలివి..  
రోడ్డుపై గుంతలు..  
చేవెళ్ల నుంచి తాండూరు వెళ్లే రోడ్డు గుంతలమయంగా ఉండడంతోపాటు ఎన్నో ప్రమాదకర మలుపులు ఉన్నాయి. తాండూరు వైపు వేగంగా వెళ్తున్న టిప్పర్‌ డ్రైవర్‌ ఆకాశ్‌ కాంబ్లే రోడ్డుపై గుంతను గమనించి వాహనాన్ని అంతే వేగంతో కుడివైపుకు తిప్పాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టాడు. దీంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

ఓవర్‌ లోడ్‌.. ఓవర్‌ స్పీడ్‌..
టిప్పర్‌లో కంకర తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధమని తెలిసింది. ప్రమాద సమయంలో టిప్పర్‌లో మొత్తం 60 టన్నులకు పైగా కంకర ఉందని సమాచారం. ఓవర్‌ లోడ్‌తో ఉన్న టిప్పర్‌ బలంగా ఢీకొట్టడం ప్రమాద తీవ్రత పెరిగిందని ఘటనా స్థలాన్ని పరిశీలించిన సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతి ‘సాక్షి’కి తెలిపారు. ఆర్టీసీ బస్సు సైతం ఓవర్‌ కెపాసిటీతోనే ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. టిప్పర్‌ బస్సును ఢీకొట్టిన తర్వాత దాదాపు 50 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది.

టార్పాలిన్‌ కప్పి ఉంటే.. కొంత ముప్పు తప్పేది  
కంకర లోడ్‌తో వెళ్లే వాహనాలు విధిగా టార్పాలిన్‌ పట్టాను కంకరపై కప్పాలి. కంకర, ఇసుక, ఇతర సామగ్రితో వెళ్లే వాహనాల కారణంగా దుమ్ము ఇతర వాహనదారులను ఇబ్బంది పెట్టకుండా, అందులోని మెటీరియల్‌ బయటికి రాకుండా ఈ జాగ్రత్త తీసుకోవాలి. కానీ, ప్రమాదానికి కారణమైన టిప్పర్‌లో కంకరపై టార్పాలిన్‌ పట్టా కట్టకపోవడంతో ప్రమాదం జరిగిన తర్వాత అందులోని కంకర అంతా ప్రయాణికులపై ఒక్కసారిగా పడింది. దీంతో వారు దానికి కింద చిక్కుకుపోయారు.

ఊపిరాడనివ్వని దుమ్ము 
టిప్పర్‌ ఢీకొట్టగానే డ్రైవర్‌ సహా..అదే వైపు సీట్లలో ఉన్న ప్రయాణికులు చెల్లాచెదురుగా పడ్డారు. కొందరు సీట్ల కింద చిక్కుకుపోయారు. ఏం జరుగుతుందో గ్రహించే లోపే టిప్పర్‌లోని కంకర వారిని కప్పేసింది. ఓవైపు కంకర బరువుకు బయటికి రాలేక కొట్టుకుంటున్న వారికి కంకరలోని దుమ్ము ఊపిరాడనివ్వలేదు. దీంతో మృతుల సంఖ్య పెరిగింది.  

ఆర్టీసీ బస్సును ఢీకొని దానిపై పూర్తిగా ఒరిగిపోయిన కంకర లోడుతో ఉన్న టిప్పర్‌ 
 
సీట్ల కెపాసిటీకి మించి ప్రయాణికులు
తాండూరు నుంచి హైదరాబాద్‌కు సోమవారం ఉదయం సమయంలో మూడు బస్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రయాణికులు అందుబాటులో ఉన్న బస్సులో సీట్లు నిండిపోయినా త్వరగా వెళ్లాలన్న తొందరలో ప్రమాదానికి గురైన బస్సు ఎక్కినట్టు తెలుస్తోంది. వాస్తవానికి బస్సులో సీట్ల కెపాసిటీ 51 ఉండగా.. 72 మంది ప్రయాణికులు బస్సెక్కారు. కిక్కిరిసిన బస్సులో నుంచి తప్పించుకోవడం కష్టమైందని అధికారులు చెబుతున్నారు.  

ప్రమాదానికి ముందు మారిన డ్రైవర్‌
లచ్చానాయక్‌ తన భార్య ఉదిత్య అనిత పేరిట ఉన్న టిప్పర్‌లో కంకర సరఫరా చేస్తుంటాడు. ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌గా పనిచేసే లచ్చానాయక్‌ తనతోపాటు మహారాష్ట్రకు చెందిన ఆకాశ్‌ కాంబ్లేను డ్రైవర్‌గా నియమించుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున కంకర లోడ్‌ వేసుకుని కాంబ్లేతోపాటు బయలు దేరిన లచ్చానాయక్‌..తొలుత చేవెళ్ల వరకు టిప్పర్‌ నడిపాడు. చేవెళ్లలో ఆకాశ్‌ కాంబ్లేకు టిప్పర్‌ను నడిపేందుకు ఇచ్చాడు. ప్రమాద స్థలికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో స్టీరింగ్‌ అందుకున్న కాంబ్లే టిప్పర్‌ను మృత్యుశకటంగా మార్చాడు. ప్రమాద సమయంలో టిప్పర్‌ డ్రైవర్‌ ఆకాశ్‌ కాంబ్లే మద్యం సేవించి ఉన్నాడా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

బస్సు డ్రైవర్‌ తప్పులేదు: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి 
ఎదురుగా ఓవర్‌ స్పీడ్‌తో టిప్పర్‌ రావడాన్ని గమనించి డ్రైవర్‌ బస్సు వేగాన్ని తగ్గిచడంతోపాటు సైడ్‌కు తప్పించే ప్రయత్నం చేసినట్టు కండక్టర్‌ ద్వారా తెలిసింది. బస్సు డ్రైవర్‌ సురక్షితంగా డ్రైవ్‌ చేస్తున్నప్పటికీ టిప్పర్‌ అదుపు తప్పి వేగంగా రావడంతో ప్రమాదాన్ని తప్పించలేకపోయారని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. బస్సు డ్రైవర్‌ దస్తగిరి ఎంతో కాలంగా పనిచేస్తున్నారని, గతంలో ఎలాంటి ప్రమాదాలు చేసిన దాఖలాలు లేవని చెప్పారు. తాండూరు నుంచి హైదరాబాద్‌కు చాలా బస్సులు ఉన్నా.. ప్రయాణికులు త్వర గా వెళ్లాలన్న తొందరలోనే ఎక్కువ మంది బస్సు ఎక్కినట్టు పేర్కొన్నారు. 

కారణాలు ఇప్పుడే నిర్ధారించలేం 
ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించాం. అయితే, ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై ఇప్పుడు కచ్చితమైన కారణాలు చెప్పలేం. దర్యాప్తు కొనసాగుతోంది. టిప్పర్‌ వేగంగా, ఓవర్‌ లోడ్‌తో వచ్చి బస్సును ఢీకొట్టినట్టుగా క్రైం సీన్‌ చూస్తే తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాం.    
 – అవినాశ్‌ మహంతి, సీపీ, సైబరాబాద్‌  

రెండు వాహనాలపై చలాన్లు 
ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ ఈ ఏడాది జనవరి 9న జహీరాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం పరిధిలో రిజిస్టర్‌ అయినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్‌నెస్‌ 2027 వరకు ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గురైన టిప్పర్‌తోపాటు బస్సుపై కూడా ట్రాఫిక్‌ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. బస్సుపై నాంపల్లి, అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో రూ.2,305 చలాన్లు జారీ చేశారు. సిగల్న్‌ జంప్, స్టాప్‌లైన్‌ క్రాసింగ్‌ ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు ఈ చలాన్లు జారీ అయ్యాయి. టిప్పర్‌పై హైదరాబాద్‌లోని రామచంద్రాపురం, మియాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులు రూ.3,600 చలాన్లు విధించారు.  

టిప్పర్‌ ఓనర్‌కు తీవ్ర గాయాలు  
అనంతగిరి: ప్రమాద సమయంలో టిప్పర్‌ ఓనర్‌ లక్ష్మణ్‌నాయక్‌ తన వాహనంలోనే ఉన్నారు. డ్రైవర్‌ వాహనం నడుపుతుంగా పక్క సీట్లో కూర్చున్నారు. ప్రమాదంలో లక్ష్మణ్‌ కుడి కన్నుకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. 

ఉస్మానియా నుంచి వైద్యబృందం 
మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు ఉస్మానియా ఆస్పత్రి నుంచి పది మంది ఫోరెన్సిక్‌ నిపుణుల బృందాన్ని, సహాయక సిబ్బందిని పంపారు. ఉస్మానియా మార్చురీ ప్రాంగణంలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్‌ విభాగం అధిపతి డా.యాదయ్య ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు సరేంద్ర, లక్ష్మీనారాయణ, వైద్యులు రాహుల్, దీన్‌దయాల్, రాజ్‌కుమార్, విష్ణు, ఫజిల్, తుదీక, అవినాష్, సహాయక సిబ్బంది రవి, ధన్‌రాజ్, సుధార్, రాజు, గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్‌ వైద్యుడు లక్ష్మీకాంత్‌ను చేవెళ్లకు పంపించారు. 

ఊపిరాడకనే మృతి  
తలకు గాయాలు, కంకర మీదపడి ఊపిరాడక మృతి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. గాయాలు బలంగా తగిలాయి. మా వైద్యం బృందం సహకారంతో చేవెళ్ల ఆస్పత్రిలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించాం. 
    – డా.రాజేంద్రప్రసాద్, సూపరింటెండెంట్, చేవెళ్ల ఆస్పత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement