మళ్లీ నడిరోడ్డు నెత్తుటి మడుగైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో సోమవారం తెల తెలవారుతుండగా ఎదురుగా దూసుకొచ్చిన టిప్పర్ 19 మంది బస్సు ప్రయాణికుల నిండు జీవితాలను కబళించింది. చదువుల కోసం వస్తున్నవారూ, ఉద్యోగాల నిమిత్తం బస్సెక్కినవారూ, ఉపాధి ఆశించి బయల్దేరినవారూ, వైద్య చికిత్స కోసం ఎదురు చూస్తున్నవారూ... అందరికందరూ మృత్యుదాహంతో దూసుకొచ్చిన టిప్పర్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలవారు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. అది పేరుకు జాతీయ రహదారే కానీ, అడుగడుగునా గుంతలు.
స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సిగ్నళ్లు మచ్చుకైనా లేక జిల్లా రోడ్డు కన్నా ఘోరంగా ఉంటుంది. పర్యవసానంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయినా జడత్వం వదుల్చుకోని అధికార యంత్రాంగం తీరువల్ల ప్రమాదాలు నిత్యకృత్య మయ్యాయి. తెలంగాణ ఆవిర్భవించిన ఈ పదకొండేళ్ల చరిత్ర చూసినా ఈ రహదారిపైనే 300 మంది జీవితాలు ముగిసిపోయాయంటే ఎవరిని నిందించాలి? వేగాన్ని అదుపు చేయలేని స్థితిలో టిప్పర్‌లోని కంకర లోడంతా బస్సు ప్రయాణికులను కమ్మేసింది.
అందుకే మృతుల సంఖ్య భారీగా ఉంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ కేసు వల్ల రహదారి విస్తరణ పనుల ప్రారంభంలో జాప్యం చోటుచేసుకున్నదని అధికారులు చెబుతున్న మాట పాక్షిక సత్యం. పదేళ్ల క్రితం రహదారిని విస్తరించాలనుకున్నప్పుడే అక్కడ వందలాది ఊడలు దిగిన మర్రి చెట్లున్నా యనీ, వాటి తొలగింపు వివాదమవుతుందనీ అంచనా ఉండాలి. ఆ వృక్షాలకు ఇబ్బంది కలగని రీతిలో రహదారి కోసం ప్రత్యామ్నాయ స్థలమైనా చూడాలి లేదా వాటిని వేరే చోటుకు తరలించి విశాలమైన రహదారి నిర్మాణానికి పూనుకోవాలి. అది వారి బాధ్యత. ఆ విషయంలో ముందస్తు కసరత్తేమీ జరగలేదని జరిగిన పరిణామాలు గమనిస్తే అర్థమవుతుంది. అనాలోచితంగా విస్తరణ పనులకు పూనుకోవటం, సమస్యాత్మకం అయ్యేసరికి నిస్సహాయత ప్రదర్శించటం దారుణం.
పర్యావరణ ప్రేమికులు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించేవరకూ చెట్ల తొలగింపును అధికారులు నిజంగానే సమస్యగా పరిగణించలేదా? ఈ విషయంలో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పాలకవర్గం ఇప్పటికే ఎంతో అనుభవం గడించివుండాలి. రహదారి డిజైన్ సమయంలో అదంతా మంట గలిసిందా? పర్యావరణంపై చైతన్యం పెరిగిన వర్తమానంలో చెట్ల తొలగింపును ఎవరూ అడ్డుకోరన్న భరోసా ఎక్కడిది? ఈ విషయంలో సంజాయిషీ చెప్పాలి. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవటం, పనులకు ఆటంకం కలిగాక తీరిగ్గా హామీలిచ్చి ట్రైబ్యునల్‌లో స్టే తొలగింప జేసుకునే ప్రయత్నం చేయటం కారణంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో వారు గమనించుకున్నారా?
ప్రమాదాలు జరిగినప్పుడల్లా పాలకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పరి హారం కూడా ప్రకటిస్తున్నారు. మంచిదే. కానీ దేశవ్యాప్తంగా వందలాది మంది ఉసురు తీస్తున్న ఈ వాహనాల అదుపు కోసం ఏం యోచిస్తున్నారు? ఇప్పుడొస్తున్న వాహనాల డిజైన్లన్నీ పాశ్చాత్య దేశాల రోడ్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవి. మన దేశంలో అసలే రోడ్లు అంతంత మాత్రం. జాతీయ రహదారులు కూడా ఇలా అక్కడక్కడ సమస్యా త్మకంగానే ఉంటున్నాయి. అటువంటి రోడ్లపై రాకెట్ వేగంతో దూసుకెళ్లే వాహనాలను అనుమతించటం సబబేనా? కనీసం పెద్ద పెద్ద బండరాళ్లు, కంకర వగైరా లోడ్ మోసుకెళ్లే టిప్పర్‌ల వేగాన్నయినా పరిమితం చేయాల్సిన అవసరం లేదా?
సరిగ్గా చేవెళ్ల వద్ద ప్రమాదం చోటుచేసుకున్న రోజే రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక టిప్పర్ పెనువేగంతో పోయి పలు వాహనాలను ఢీకొన్న ఉదంతంలో 14 మంది మరణించారు. మొన్న సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియా ట్రక్కు రాంగ్‌రూట్‌లో పోయి కారును ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇసుక, గ్రానైట్, కంకర, నాపరాళ్లు వగైరా వ్యాపారాల్లో టిప్పర్లు అవసరాన్ని మించి లోడ్ మోసుకెళ్లటం, పెనువేగంతో పోవటం తరచూ కనబడుతోంది. వీటి నియంత్రణకు నిబంధనలు రూపొందించకపోతే, ఈ అరాచకాన్ని నిలువరించకపోతే జనం క్షమించరు.


