తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజలు వినియోగించే ఔషధాల వల్ల కలిగే దుష్ప్రభావాలను త్వరితగతిన గుర్తించేందుకు, దేశవ్యాప్తంగా ఫార్మాకోవిజిలెన్స్ చర్యలను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రిటైల్, హోల్‌సేల్ మెడికల్ షాపుల్లో ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా (పీవీపీఐ) అందించిన ప్రత్యేక క్యూఆర్ కోడ్, టోల్ ఫ్రీ నంబర్ 1800–180–3024ను తప్పనిసరిగా ప్రదర్శించాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఆదేశించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసిమ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజలు మెడికల్ షాపుల నుంచి మందులు వాడిన తర్వాత ఏదైనా దుష్ప్రభావం కనిపించినప్పుడు వెంటనే సమాచారం ఇవ్వడానికి ఈ క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి మెడికల్ షాప్‌లో స్పష్టంగా కనిపించే ప్రదేశంలో క్యూఆర్ కోడ్ ఉంచాలని, దాన్ని స్కాన్ చేసి ప్రజలు నేరుగా అనుమానాస్పద, ప్రతికూల చర్యలను తెలియజేయవచ్చని పేర్కొ న్నారు. ఈ ఫిర్యాదులు నేరుగా పీవీపీఐ ఏర్పాటు చేసిన అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ మానిటరింగ్ సిస్టమ్ (ఏడీఆర్‌ఎంఎస్)కు చేరి, దేశవ్యాప్తంగా ఔషధ భద్రత చర్యలకు బలాన్నిస్తాయని వివరించారు.


