ప్రారంభమైన కౌంట్‌డౌన్
నేటి సాయంత్రం 5.26 గంటలకు
నింగిలోకి సీఎంఎస్–03 ఉపగ్రహం
సూళ్లూరుపేట/తిరుమల: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్ ద్వారా 4,400 కిలోల బరువు కలిగిన సీఎంఎస్–03 అనే సమాచార ఉపగ్రహాన్ని ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించి శనివారం సాయంత్రం 5.26 గంటలకు ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు.
శనివారం ఉదయాన్నే షార్‌కు వచ్చిన ఆయన ప్రయోగవేదిక మీదున్న రాకెట్‌ను పరిశీలించిన అనంతరం సహచర శాస్త్రవేత్తలతో ప్రయోగంపై ప్రత్యేకంగా సమీక్షించారు. 4,400 కిలోల బరువు కలిగిన సీఎంఎస్–03 కమ్యూనికేషన్ ఉపగ్రహం బహుళ–బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం కావడం విశేషం.
శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్: తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ శనివారం దర్శించుకున్నారు. షార్ నుంచి ఆదివారం సీఎంఎస్–03 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న నేపథ్యంలో ఆయన శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సీఎంఎస్–03 ఉపగ్రహం నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.


