రెండోవారంలో ఎల్‌వీఎం3 మార్క్–6 రాకెట్ ద్వారా బ్లాక్–2 బ్లూబర్డ్ ఉపగ్రహం
చివరివారంలో పీఎస్‌ఎల్‌వీ సీ62 రాకెట్ ద్వారా ఓషన్‌శాట్–3ఏ ఉపగ్రహం
షార్‌లో కొనసాగుతున్న రాకెట్ల అనుసంధానం పనులు
సూళ్లూరుపేట: ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు రాకెట్ ప్రయోగాలే చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిసెంబర్ నెలలో రెండు ప్రయోగాలకు సిద్ధమవుతోంది. రెండోవారంలో ఎల్‌వీఎం3 మార్క్–6 రాకెట్ ద్వారా బ్లాక్–2 బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని, చివరివారంలో పీఎస్‌ఎల్‌వీ సీ62 రాకెట్ ద్వారా ఓషన్‌శాట్–3ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. షార్‌లోని రెండో ప్రయోగవేదికకు అనుసంధానంగా ఉన్న రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన ఎల్‌వీఎం3 మార్క్–6 రాకెట్ అనుసంధానం పనులు చురుగ్గా సాగుతున్నాయి.
ఈ ప్రయోగం ద్వారా అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ రూపొందించిన 6,500 కిలోల బరువు కలిగిన బ్లాక్–2 బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని వాణిజ్యపరంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహానికి సంబంధించి అమెరికన్ శాస్త్రవేత్తలు షార్‌లో రాకెట్ అనుసంధానం పనుల్లో పాలుపంచుకుంటున్నారు. ఇస్రో చరిత్రలో 6,500 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
సాంకేతిక విప్లవం... బ్లాక్–2 బ్లూబర్డ్
టెక్సాస్‌లోని ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన బ్లూబర్డ్ ఉపగ్రహం విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు అంతరిక్షం నుంచి స్మార్ట్ ఫోన్లు ఉపయోగించి కాల్స్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా దీన్ని రూపొందించారు. భూమికి తక్కువ దూరంలోని లియో ఆర్బిట్ నుంచి పనిచేసే ఈ ఉపగ్రహానికి 64 చదరపు మీటర్ల వినూత్నమైన యాంటెన్నా ఉంది. ఇది ఉపగ్రహం నుంచి స్మార్ట్ ఫోన్‌కు ప్రత్యక్ష కనెక్టివిటీని సులభతరం చేస్తుంది.
మొబైల్‌ఫోన్ వినియోగదారులు భూమిపై ఉండే టవర్ల మీద ఆధారపడకుండా అంతరిక్షం నుంచి కాల్స్ చేయడానికి, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడానికి ఈ ఉపగ్రహం దోహదపడుతుంది. బ్లూబర్డ్ ఉపగ్రహం కిరణాలు 40 ఎంహెచ్‌జడ్ వరకు సామర్థ్యాన్ని కలిగి ఉండేలా రూపొందించారు.
ఇది 120 ఎంబీపీఎస్ వరకు గరిష్ట ట్రాన్స్‌మిషన్ వేగాన్ని అందిస్తుంది. బ్లూబర్డ్ ఉపగ్రహాల సిరీస్ యూఎస్‌ఏలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంపికచేసిన మార్కెట్లలో నిరంతరాయంగా సెల్యులార్ బ్రాండ్‌బ్యాండ్ సేవలు అందించాలన్నదే లక్ష్యంగా దీన్ని ప్రయోగిస్తున్నారు.
1,800 కిలోల బరువున్న ఓషన్‌శాట్–3ఏ
డిసెంబర్ ఆఖరువారంలో ప్రయోగించే పీఎస్‌ఎల్‌వీ సీ62 రాకెట్ అనుసంధానం పనులు మొదటి ప్రయోగవేదికకు అనుసంధానంగా ఉన్న పిఫ్ బిల్డింగ్‌లో జరుగుతున్నాయి. ఈ రాకెట్ ద్వారా 1,800 కిలోల బరువున్న ఓషన్‌శాట్–3ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ రాకెట్‌లను షెడ్యూల్ చేసిన తేదీల్లో ప్రయోగించలేకపోవడంతో రెండు ప్రయోగాలను డిసెంబర్‌లోనే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ఏడాది రాకెట్ ప్రయోగాల జోరు తగ్గింది. జనవరి తరువాత మూడునెలలు ప్రయోగాలే లేవు. మే, జూలై నెలల్లో రెండు ప్రయోగాలు చేశారు. ఆ తరువాత మూడునెలలు ప్రయోగాలకు బ్రేక్‌పడింది. ఈ నెల 2న ఒక రాకెట్ ప్రయోగించిన విషయం తెలిసిందే. అంటే ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం నాలుగు ప్రయోగాలు మాత్రమే చేశారు.


