సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్‌కు వస్తున్న జనాదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని.. ఆయన దిక్కులేని స్థితిలోకి పడిపోయారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అంటే రౌడీలుగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాష్ట్రంలో జనం తీవ్రంగా వ్యతిరేకించారన్నారు.
‘‘జగన్ పుట్టినరోజు వేడుకలను ఈసారి చాలా గొప్పగా జరిగాయి. వీటిని చూసి చంద్రబాబు అసలు తట్టుకోలేకపోయారు. దీంతో చంద్రబాబుకు ఊపిరి సలపటం లేదు. అంతలోనే రాజధానికి భూమి ఇచ్చిన రైతు మృతి చెందారు. వీటన్నిటినీ డైవర్షన్ చేసేందుకు కొత్త డ్రామా ఎత్తుకున్నారు. హోంమంత్రి అనిత జంతుబలి అంటూ నానా గొడవ చేస్తున్నారు.
..చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు అనేక పొట్టేళ్ల తలలు నరికారు. బాలకృష్ణ సినిమా ఫ్లెక్సీకి పొట్టేళ్ల తల కాయలతో దండలు వేశారు. మరి మమ్మల్ని ప్రశ్నించే హోంమంత్రి అనిత.. చంద్రబాబు, బాలకృష్ణను ప్రశ్నించగలరా?. రప్పారప్పా అనే పదం పోస్టర్ వేశారని మా వారిపై కేసులు పెడుతున్నారు. ఆ డైలాగ్ తప్పు అయితే మరి సెన్సార్ బోర్డ్ ఎలా అంగీకరించింది?. హోంమంత్రి అనితకి అధికారం వలన ఇవేమీ కనపడటం లేదు. కుప్పంలో ఒక మహిళ తనపై లైంగికదాడి చేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఇదీ రాష్ట్రంలో పోలీసులు, ప్రభుత్వం పనితీరు
..బల్క్ డ్రగ్ పార్కు విషయంలో అనిత ఎన్నికలకు ముందు ఒకమాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారు. అమరావతిలో ఒక రైతు గుండె పగిలి చనిపోతే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?. జాకీలు ఎత్తే మీడియా ఉందని ఇష్టానుసారం వ్యవహరిస్తే జనం సహించరు. పోలీసులను ఇంత దుర్మార్గంగా వాడుతున్న ప్రభుత్వం ఇదే. పబ్లిసిటీ మీద బతుకుతున్న ప్రభుత్వం ఇది’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.


