సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేక పోయారని.. జంతుబలి అంటూ నానాయాగీ చేశారంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మరి బాలకృష్ణ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన జంతుబలి కనపడలేదా?. చంద్రబాబు పుట్టినరోజు నాడు జరిగిన జంతుబలి కనపడలేదా?’’ అంటూ నిలదీశారు.
‘‘మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రతిదీ మేము గుర్తు పెట్టుకుంటాం. అధికారంలోకి రాగానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం.. గుర్తు పెట్టుకోండి. హోంమంత్రి అనిత అసమర్థ మంత్రి. పోలీసు వ్యవస్థను దేశంలోనే 36వ స్థానానికి తీసుకెళ్లారు. అదీ హోంమంత్రి పనితీరు. మమ్మల్ని దూషించే ముందు పోలీసు శాఖను సరి చేయండి. మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టటం కాదు’’ అని వరుదు కళ్యాణి హితవు పలికారు.
‘‘మీకు దమ్ముంటే మీ పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోండి. మహిళను వేధించిన మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్‌ని అరెస్టు చేయండి. రప్పారప్పా అనే సినిమా డైలాగ్ కూడా వినలేక పోతున్నారు. మరి బాలకృష్ణ సినిమాలో డైలాగులు ఎలా ఉన్నాయో చూడండి. టీడీపీ సోషల్ మీడియా సైకోల్లాగా వ్యవహరిస్తోంది. గీతాంజలి అనే తెనాలి యువతి ఆత్మహత్య చేసుకునే వరకు టీడీపీ సోషల్ మీడియా చేసింది. కదిరి ఘటనలోని అజయ్ దేవ మా కార్యకర్త కాదని తెలియగానే హోంమంత్రి అనిత పడుతున్న పాట్లు మాకు అర్థం అయింది. జగన్‌ని తిట్టటానికే అనిత పదవిలో ఉన్నారు
..చంద్రబాబు తన తల్లి, చెల్లెలకు ఏ మాత్రం ఆస్తి ఇచ్చారో అనిత తెలుసుకుంటే మంచిది. హైదరాబాదులో రాజభవనం కట్టి కనీసం తల్లి, చెల్లెల్ని పిలవని వ్యక్తి చంద్రబాబు. హోంమంత్రి అనిత ఆ విషయాల గురించి మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే మంచిది. ఎమర్జెన్సీ కాల్ చేస్తే పోలీసులు స్పందిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వమే ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు పెట్టే అక్రమ కేసులకు మావాళ్లు భయపడరు’’ అని వరుదు కల్యాణి తేల్చి చెప్పారు.


