సాక్షి, తాడేపల్లి: ఈనాడు సంపాదకీయంపై వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ జగన్‌పై విషం చిమ్ముతూ రోత రాతలు రాసిన ఈనాడుపై వైఎస్సార్‌సీపీ మండిపడింది. ఈనాడు పత్రికను బహిష్కరిస్తున్నట్టు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, కార్యకర్తలు.. ఈనాడు ప్రతులను తగులపెట్టి నిరసన తెలిపారు.
టీజేఆర్ సుధాకర్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పెద్దమనిషి ముసుగు వేసుకున్న నకిలీ నాయకుడంటూ ధ్వజమెత్తారు. ఆయన చెప్పేది ఒకటి, చేసేదిమరొకటి.. చంద్రబాబు రాజకీయ ప్రయాణమంతా కుట్రలు, కుతంత్రాలే. ప్రజల కష్టాలను వదిలేసి చంద్రబాబుకు భజన చేయటంలో ఎల్లోమీడియా తరించిపోతోంది’’ అంటూ టీజేఆర్ నిప్పులు చెరిగారు.
‘‘అమ్మవారికి బలి ఇవ్వటం అనేది పురాతనకాలం నుండి వస్తున్న ఆచారం. జగన్‌కు కొందరు అభిమానులు రక్తంతో తర్పణం చేయటం తప్పని చంద్రబాబు అన్నారు. మరి చంద్రబాబు పుట్టినరోజు నాడు జరిగిన జంతుబలిని ఏం అంటారు?. బాలకృష్ణ ఫ్లెక్సీకి మేకలను చంపి దండగా వేశారు. మరి దీన్ని జీవహింసగా ఎందుకు మాట్లాడటం లేదు?. జగన్ ఏనాడూ హత్యా రాజకీయాలు ఏనాడూ చేయలేదు. ప్రజలను ప్రేమిస్తూ వారికోసం ఎన్నో మేళ్లు చేసిన వ్యక్తి జగన్.. అందుకే అన్ని వర్గాల ప్రజలూ జగన్‌ని ప్రేమిస్తారు
..ఇది తట్టుకోలేక ఎల్లోమీడియా, చంద్రబాబు జగన్‌పై విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే కొన్ని తరాలకు సరిపడా సంపాదించుకోవచ్చని ఎల్లోమీడియా చూస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దన్నందుకు ఈనాడు పత్రిక విషం కక్కింది. ఈనాడు పత్రిక చంద్రబాబు జేబుసంస్థ. జగన్ పై నిత్యం విషం కక్కుతున్న ఈనాడును బహిష్కరిస్తున్నాం. జర్నలిజం ముసుగులో ఈనాడు పత్రిక అనైతిక చర్యలకు పాల్పడుతోంది. అందుకే ఈనాడును ఎవరూ చదవద్దు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ వెనుక జరిగిన స్కాంలపై అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తాం. తప్పులు తేలితే కచ్చితంగా చర్యలకు దిగుతాం’’ అంటూ టీజేఆర్ సుధాకర్‌బాబు హెచ్చరించారు.


