ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు కీలక ప్రయోగాలు
2035 నాటికి ‘ఇండియన్ స్పేస్ స్టేషన్’ సిద్ధం
2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగాములు
ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ వెల్లడి
కోల్‌కతా: కీలకమైన ప్రయోగాలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సిద్ధమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు ప్రయోగాలు చేపట్టనుంది. ఇందుకోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు భారతదేశ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రను 2027లో చేపట్టబోతున్నట్లు ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ ప్రకటించారు. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
సైన్స్ అండ్ టెక్నాలజీలో మన దేశం మరింత ముందుకు దూసుకెళ్లడమే లక్ష్యంగా అంతరిక్ష ప్రయోగాలకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఏడు ప్రయోగాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో వాణిజ్య కమ్యూనికేషన్ శాటిలైట్, బహుళ పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ కార్యక్రమాలు ఉన్నాయని స్పష్టంచేశారు. పూర్తిగా దేశీయంగానే మన పరిశ్రమలు తయారు చేసిన తొలి పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను నింగిలోకి పంపింబోతున్నామని, ఇదొక మైలురాయి కాబోతోందని చెప్పారు.
జపాన్‌తో కలిసి లూపెక్స్ ప్రోగ్రామ్
ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్–4 మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేసిందని వి.నారాయణన్ తెలియజేశారు. మన అంతరిక్ష యాత్రలో ఇదొక కీలక ప్రయోగం అవుతుందన్నారు. 2028లో చంద్రయాన్–4 ప్రయోగం నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. అలాగే జపాన్‌కు చెందిన ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీతో కలిసి లూపెక్స్(లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్) ప్రోగ్రామ్ నిర్వహించనున్నామని వివరించారు. భవిష్యత్తు డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రాకెట్ల తయారీని మూడు రెట్లు పెంచబోతున్నామని తెలిపారు. అందుకోసం కార్యాచరణ మొదలైందని అన్నారు.
2027లో మానవ సహిత యాత్ర
సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకొనే దిశగా ముందడుగు వేస్తున్నామని పేర్కొన్నారు. 2035 నాటికి అంతరిక్షంలో ‘ఇండియన్ స్పేస్ స్టేషన్’ సిద్ధమవుతుందని ధీమా వ్యక్తంచేశారు. ఇందులో మొత్తం ఐదు మాడ్యూల్స్ ఉంటాయని, తొలి మాడ్యూల్‌ను 2028 నాటికి కక్ష్యలోకి ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. మానవ సహిత అంతరిక్ష యాత్రను 2027లో చేపట్టే అవకాశం ఉందన్నారు.
భారత వ్యోమగాములను చంద్రుడి ఉపరితలంపైకి పంపించి, క్షేమంగా వెనక్కి తీసుకొచ్చే ప్రయోగాన్ని 2040 నాటికి చేపట్టాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమకు సూచించారని ఇస్రో అధినేత స్పష్టంచేశారు. గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారత్ వాటా ప్రస్తుతం 2 శాతంగా ఉందన్నారు. 2030 నాటికి దీన్ని 8 శాతానికి చేర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం నానాటికీ పెరుగుతోందన్నారు. ప్రస్తుతం 450కిపైగా పరిశ్రమలు, 330 స్టార్టప్ కంపెనీలు ఇందులో పాలుపంచుకుంటున్నాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందన్నారు.
ఏమిటీ చంద్రయాన్–4?
చందమామపై ప్రయోగాలకు ఉద్దేశించినదే చంద్రయాన్–4. చంద్రుడిపైకి అంతరిక్ష నౌకను పంపించి, అక్కడ మట్టి, రాళ్లు లాంటి నమూనాలను సేకరించి, భూమిపైకి తీసుకురావడమే చంద్రయాన్–4 లక్ష్యం. ప్రస్తుతం ఇలాంటి సామర్థ్యం కేవలం అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఉంది. భారత్ కూడా సఫలమైతే ఈ విషయంలో నాలుగో దేశంగా నిలుస్తుంది. ఇక లూపెక్స్ ప్రయోగ లక్ష్యం ఏమిటంటే చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద మంచు రూపంలో ఉన్న నీటిని అధ్యయనం చేస్తారు. మరోవైపు చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకోగా, అమెరికా సైతం ఇదే పనిలో నిమగ్నమైంది. అర్టిమిస్ పేరిట కార్యాచరణ ప్రారంభించింది. చైనా సైతం 2030 నాటికి తమ వ్యోమగాములను చంద్రుడిపైకి పంపిస్తామని చెబుతోంది.


