ప్రయోగాలు తగ్గించిన ఇస్రో | SRO has reduced PSLV launches: Andhra pasrdesh | Sakshi
Sakshi News home page

ప్రయోగాలు తగ్గించిన ఇస్రో

Dec 30 2025 5:20 AM | Updated on Dec 30 2025 5:20 AM

SRO has reduced PSLV launches: Andhra pasrdesh

పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు తగ్గించి.. జీఎస్‌ఎల్‌వీ, ఎల్‌వీఎం–3 రాకెట్‌ ప్రయోగాల పెంపు  

ఒకేఒక్క పీఎస్‌ఎల్‌వీ ప్రయోగించినా విఫలం  

మరోవైపు 6,400 కిలోల వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం విజయవంతం 

2026 మార్చికి అందుబాటులోకి రానున్న కులశేఖరపట్నంలోని రాకెట్‌ ప్రయోగకేంద్రం

భారీ ప్రయోగాల కోసం బలీయంగా శ్రీహరికోటలోని షార్‌ సెంటర్‌

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. ఈ ఏడాది కేవలం ఐదు ప్రయోగాలకే పరి­మితమైంది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి రెండు జీఎస్‌ఎల్‌వీ రాకె­ట్లు, రెండు ఎల్‌వీఎం–3 రాకెట్లు, ఒక్క పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను మాత్రమే ప్రయోగించారు. గతంలో ఏడాదికి నాలుగుకుపైనే పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్ర­యో­గాలు ఉండేవి. జీఎస్‌ఎల్‌వీ, ఎల్‌వీఎం–3 రాకెట్‌ ప్రయోగాలు ఏడాదికి ఒకటో రెండో ఉండేవి. ఈ ఏడాది ఒకే ఒక్క పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగించినప్పటికీ విఫలమైంది. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలను తగ్గించి జీఎస్‌ఎల్‌వీ, ఎల్‌వీఎం–3 రాకెట్ల ప్రయోగాలు పెంచుతున్నారు. ఈ ప్రయోగాలకు సంబంధించిన క్రయోజనిక్‌ దశను వివిధ రూపా­ల్లో తయారు చేసి విజయాలు నమోదు చేస్తున్నారు.  

జనవరి నుంచే ప్రయోగాలు  
ఈ ఏడాది ప్రారంభంలోనే అంటే జనవరి 29న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌ 15 రాకెట్‌ ద్వారా నావిగేషన్‌ శాటిలైట్‌ (ఎన్‌వీఎస్‌–02)ను  ప్రయోగించారు. మే 18న పీఎస్‌ఎల్‌వీ సీ 61 ద్వారా ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (ఈఓఎస్‌–09)ను ప్రయోగించగా విఫలమైంది. జూలై 30న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌ 16 ద్వారా ఇస్రో–నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్‌ ఉపగ్రహాన్ని, నవంబర్‌ 2న ఎల్‌వీఎం3 – ఎం5 రాకెట్‌ ద్వారా కంటెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (సీఎంఎస్‌–03) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. డిసెంబర్‌ 24న ఎల్‌వీఎం – 3 – ఎం6 రాకెట్‌ ద్వారా అమెరికాకు చెందిన 6,400 కిలోల అత్యంత బరువైన బ్లూబర్డ్‌ బ్లాక్‌–2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి ప్రపంచంలో భారత కీర్తిపతాకాన్ని ఎగురవేశారు.

ఇస్రో చరిత్రలో ఈ ఏడాది సువర్ణాక్షరాలతో లిఖించదగిన  ప్రయోగాలు చేసింది. ఇస్రో బాహుబలిగా పేరు­గాంచిన ఎల్‌వీఎం–3 రాకెట్‌ను ఎప్పుడో రెండు మూడేళ్లకు ఒకటి, రెండుసార్లు ప్రయోగించేవారు. అలాంటిది ఈ ఏడాది 52 రోజుల వ్యవధిలో రెండు ప్రయోగాలు చేసి విజయాలను సొంతం చేసుకోవడం ఒక మైలురాయిగా నిలిచింది. ఇస్రో చరిత్రలో ఇప్పటిదాకా రెండువేల కిలోల నుంచి మూ­డు­వేల కిలోల బరువైన ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించారు. ఈ ఏడాది ప్రపంచంలో అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాకు చెందిన 6,400 కిలోల అత్యంత బరువైన ఉపగ్రహాన్ని వాణిజ్యపరంగా ప్రయోగించి చరిత్ర సృష్టించారు.  

లాంచింగ్‌ సౌకర్యాలు పెరిగినా.. ఆ స్థాయి ప్రయోగాలు లేవు
శ్రీహరికోటలో లాంచింగ్‌ సౌకర్యాలు విపరీతంగా పెరిగినప్పటికీ ఆ స్థాయిలో రాకెట్‌ ప్రయోగాలు నిర్వహించడంలో ఇస్రో వెనుకంజలోనే ఉంది. 2022, 2023 సంవత్సరాల్లో ఎనిమిదేసి ప్రయోగాలు చేసిన ఇస్రో 2024, 2025ల్లో అయిదేసి ప్ర­యోగాలకే పరిమితమైంది. 2020, 2021ల్లో కరో­నా మహమ్మారి కారణంగా రెండేసి ప్రయో­­గా­లతో సరిపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్టాయి. మొ­దటి ప్రయోగవేదిక మీద ఒకేసారి రెండు రాకెట్ల­ను అనుసంధానం చేసే సౌకర్యాలున్నాయి. రెండో ప్రయోగవేదికకు సంబంధించి రెండు వెహికల్‌ అసె­ంబ్లింగ్‌ బిల్డింగ్‌లతోపాటు ఎస్‌ఎస్‌ఏబీ భవ­నం కూడా ఉంది. అంటే ఇక్కడ కూడా ఒకేసారి అయిదు రాకెట్లు అనుసంధానం చేసే వీలుంది. ఇక్కడ ఘన ఇంధన మోటార్ల  తయారీ సామ­ర్థ్యాన్ని కూడా పెంచారు.

ఇన్ని వసతులు మెరుగుపడినా ఆ స్థాయిలో రాకెట్లను ప్రయోగించడంలేదు. ఈ నెల 24న చేసిన ఎల్‌వీఎం3 – ఎం6  ప్రయో­గ­ంతో షార్‌ నుంచి 104 ప్రయోగాలు పూర్తయ్యా­యి. ఇందులో నాలుగు.. ఉపగ్రహాలు లేకుండా ప్ర­యోగాత్మకంగా నిర్వహించారు. ఈ నెల 24న చేసింది.. ఉపగ్రహాలతో కూడిన వందో ప్రయోగం. వచ్చే మార్చి నాటికి తమిళనాడు తూత్తుకుడి సమీ­పంలోని కులశేఖరపట్నంలో నిర్మీస్తున్న రాకె­ట్‌ ప్రయోగకేంద్రం అందుబాటులోకి రానుంది. పీ­ఎస్‌­ఎల్‌వీ, ఎస్‌ఎస్‌ల్‌వీ రాకెట్‌ ప్రయోగాలను అక్కడి నుంచే నిర్వహించే అవకాశాలున్నాయి. భారీ ప్రయోగాల కోసం శ్రీహరికోట షార్‌ కేంద్రా­న్ని బలీయమైన శక్తిగా తయారు చేస్తున్నారు. ఇక భవిష్యత్‌లో ప్రతిష్టాత్మకమైన గగన్‌యాన్‌ అన్‌మ్యా­­న్‌ మిషన్, గగన్‌యాన్‌ మ్యాన్‌ మిషన్, చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించే ప్రయోగాలతోపాటు సుమారు 10 వేలకిలోల బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించే సాంకేతిక పరిజ్ఞానా­న్ని సముపార్జించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement