బెంగళూరు: స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్వీ) మూడో దశ పరీక్షను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్ ఫెసిలిటీలో మంగళవారం 108 సెకన్ల పాటు ప్రయోగం విజయవంతంగా జరిగినట్టు ఇస్రో వెల్లడించింది. మూడు దశల లాంచ్ వెహికల్ అయిన ఎస్‌ఎస్‌ఎల్వీని ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధి చేసింది.
డిమాండ్‌ను బట్టి వెంటవెంటనే అంతరిక్ష ప్రయోగాలు చేయగలగడం దీని ప్రత్యేకత. పేలోడ్‌కు సెకనుకు 4 కి.మీ.ల వేగాన్ని అందించడంలో మూడో దశ సాలిడ్ మోటార్ తాలూకు అప్పర్ స్టేజ్ విశేషంగా దోహదపడుతుందని ఇస్రో తెలిపింది. ‘‘ఈ పరీక్షలో వాడిన కార్బన్ ఎపోక్సీ మోటార్ కేస్ వల్ల ఉపగ్రహ బరువు బాగా తగ్గుతుంది. ప్రయోగం తాలూకు కచ్చితత్వం మరింత పెరుగుతుంది. ఇగ్నైటర్, నాజల్ వ్యవస్థల డిజైన్‌ను ఈసారి మరింత ఆధునీకరించాం.
తద్వారా ప్రయోగ సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఇందులో వాడిన అధునాతన విడిభాగాలను సొంతంగా∙తయారు చేసుకున్నాం. కార్బన్ ఫిలమెంట్ వూండ్ మోటార్‌ను విక్రం సారాబాయ్ అంతరిక్ష కేంద్రంలోని కాంపోజిట్స్ ఎంటిటీ ప్లాంట్, సాలిడ్ మోటార్‌ను సతీశ్‌ధవన్ కేంద్రంలోని సాలిడ్ మోటార్ ప్రొడక్షన్ ప్లాంట్‌లో రూపొందించాం’’అని పేర్కొంది. శ్రీహరికోటలో సాలిడ్ మోటార్ ఉత్పత్తి వ్యవస్థలను గత జూలైలోనే ఏర్పాటు చేశారు.


