ఇప్పటికే నాలుగురు ఆడపిల్లలు..మళ్లీ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది | Government Hospital Successful Caesarean Triplets Born | Sakshi
Sakshi News home page

ఇప్పటికే నాలుగురు ఆడపిల్లలు..మళ్లీ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది

Jan 29 2026 11:21 AM | Updated on Jan 29 2026 11:35 AM

Government Hospital Successful Caesarean Triplets Born

అనంతపురం: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని గైనిక్‌ విభాగం వైద్యులు కష్టతరమైన ఓ సిజేరియన్‌ కేసును అత్యాధునిక పద్ధతులను అనుసరించి విజయవంతం చేశారు. తద్వారా కవిత అనే నిండు గర్భిణి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రైవేట్‌గా ఈ తరహా చికిత్స పొందాలంటే రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుందని, సర్వజనాస్పత్రిలో గైనిక్‌ విభాగం వైద్యులు ఉచితంగా శస్త్రచికిత్స చేసి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడినట్లు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మల్లీశ్వరి తెలిపారు. బుధవారం జీజీహెచ్‌లోని ఎస్‌ఎన్‌సీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆమె వెల్లడించారు. 

‘బ్రహ్మసముద్రం నంజాపురం గ్రామానికి చెందిన రమేష్‌, కవిత దంపతులకు ఇప్పటికే 17, 10, 8, 5 ఏళ్ల వయసున్న ఆడపిల్లలు ఉన్నారు. కాగా, మగ బిడ్డ కోసం నిరీక్షించారు. ఈ క్రమంలో ఒక అబార్షన్‌ కూడా జరిగింది. అనంతరం గర్భం దాల్చిన ఆమె ఈ నెల మొదట్లో గైనిక్‌ విభాగం యూనిట్‌ 3లో చూపించుకున్నారు. హెచ్‌ఓడీ డాక్టర్‌ సుచిత్ర, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నవ్యశ్రీ పరీక్షించి ఎపిలెప్సీ కాంప్లికేటెడ్‌ ప్రెగ్నెన్సీగా (ఫిట్స్‌తో బాధపడుతున్నట్లు) నిర్ధారించి విషయాన్ని గైనిక్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ షంషాద్‌బేగం దృష్టికి తీసుకెళ్లారు. ఆమె పర్యవేక్షణలో న్యూరాలజీ, అనస్తీషియా విభాగాల సూచనలతో కవితకు చికిత్స అందజేస్తూ వచ్చారు. 

నెలలు నిండడంతో ఈ నెల 19న డాక్టర్‌ సుచిత్ర, డాక్టర్‌ నవ్యశ్రీ, డాక్టర్‌ నవీన్‌కుమార్‌ కలసి ఎపిడ్యూరల్‌ అనస్తీషియా అందిస్తూ సిజేరియన్‌ చేశారు. ఉదయం 10.44 గంటలకు ఆడబిడ్డ (1.75 కేజీల బరువు), 10.46 గంటలకు మగబిడ్డ (1.4కేజీ బరువు), 10.47 గంటలకు ఆడబిడ్డ (1.75 కేజీ బరువు)కు కవిత జన్మనిచ్చారు. మగ బిడ్డ బరువు పెరగడానికి ఎస్‌ఎన్‌సీయూలో అడ్మిషన్‌లో ఉంచి వైద్యం అందించారు. అత్యంత క్లిష్టమైన సిజేరియన్‌ను విజయవంతం చేసిన డాక్టర్‌ షంషాద్‌బేగం, డాక్టర్‌ సుచిత్ర, డాక్టర్‌ నవ్యశ్రీను సూపరింటెండెంట్‌ అభినందించారు. సమావేశంలో ఆర్‌ఎంఓ డాక్టర్‌ హేమలత, చిన్నపిల్లల వైద్య విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ రవికుమార్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌దీన్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement