న్యూఢిల్లీ: శత్రు భీకర ప్రళయ్ క్షిపణులను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) విజయవంతంగా పరీక్షించింది. బుధవారం ఒడిశా తీర సమీపంలో రెండు క్షిపణులను వెంటవెంటనే ప్రయోగించినట్టు సంస్థ వెల్లడించింది. ప్రళయ్ 150 నుంచి 500 కి.మీ.ల స్వల్ప శ్రేణి సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణి. 500 నుంచి 1,000 కిలోల సంప్రదాయ పేలోడ్‌ను మోసుకెళ్లగలదు.
మేకిన్ ఇండియా మిషన్‌లో భాగంగా దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించడం విశేషం. పూర్తిస్థాయి కచ్చితత్వం ప్రళయ్ క్షిపణుల ప్రత్యేకత. ఇందులో అమర్చిన అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థే అందుకు కారణం. పరీక్షను విజయవంతం చేసినందుకు డీఆర్‌డీఓ, వాయుసేన, సైన్యంతో పాటు ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందనలు తెలిపారు. ప్రళయ్ క్షిపణిని డీఆర్‌డీఓతో పాటు పలు రక్షణరంగ సంస్థలతో కలిసి రీసెర్చ్ సెంటర్ ఇమారత్ రూపొందించింది.


