breaking news
manned space missions
-
సునీత ‘స్టార్ ట్రెక్’!
ముప్పై ఏళ్లు సాగిన అమెరికన్ స్పేస్ షటిల్స్ శకం 2011లో ముగిసింది. ఇక 1960ల నాటి సోవియట్ సోయజ్ కేప్సూల్ ఓ పాతబడ్డ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో నెట్టుకొస్తున్నా అదీ ని్రష్కమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేసింది. రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడుపుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, పెట్టుబడులు, పరిశోధన, చంద్ర–అంగారక యాత్రలు... అన్నింట్లోనూ ప్రైవేటైజేషన్‌దే హవా కానుంది! ప్రైవేటు రంగమే రోదసిని ఏలబోతోంది. ప్రభుత్వరంగ పాత్ర క్రమంగా కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తో కూస్తో నిధులకే పరిమితమవుతోంది. రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు (స్పేస్ కేప్సూల్స్) అంతరిక్షాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యాయి. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లనున్నాయి. ‘ఎక్స్’ బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తోంది. సరుకులతో పాటు వ్యోమగాములనూ చేరవేస్తోంది. ప్రపంచ అతి పెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ–100 స్టార్‌లైనర్’ వ్యోమనౌకతో మే 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో విశేషం... మన సునీత హ్యాట్రిక్! సునీతా విలియమ్స్. ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్. ముద్దుపేరు సునీ. 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతున్నారు. అమెరికన్ నేవీ కెపె్టన్ (రిటైర్డ్) సునీతకు అనుభవమే మనోబలం. ఆమెను నాసా 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్యాది ముంబై. తల్లి అర్సలిన్ బోనీ స్లోవేన్–అమెరికన్. సునీత 1965లో అమెరికాలో జని్మంచారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్–5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ ‘స్టార్‌లైనర్’ వ్యోమనౌకలో ఈ నెల 6న రాత్రి 10:34కు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04కు) ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ నుంచి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ ఐఎస్ఎస్లో వారం గడిపి తిరిగొస్తారు. సునీత 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లారు. 2007 జూన్ 22 దాకా రోదసిలో గడిపారు. నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. రెండోసారి 2012 జులై 14 నుంచి 127 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. మూడుసార్లు స్పేస్ వాక్ చేశారు. రెండు మిషన్లలో మొత్తం 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. బోయింగ్... గోయింగ్! అమెరికా స్పేస్ షటిల్స్ కనుమరుగయ్యాక అంతరిక్ష యాత్రల కోసం రష్యా సోయజ్ రాకెట్–వ్యోమనౌకల శ్రేణిపైనే నాసా ఆధారపడింది. కానీ ఒక్కో వ్యోమగామికి రష్యా ఏకంగా రూ.700 కోట్లు చొప్పు న వసూలు చేస్తోంది. దాంతో వ్యోమనౌకల అభివృద్ధి కోసం నాసా 2014లో బోయింగ్‌కు 4.2 బిలియన్ డాలర్లు, (రూ.35 వేల కోట్లు), స్పేస్ ఎక్స్‌కు 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టులు కట్టబెట్టింది. స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్‌లో 2020 నుంచే వ్యోమగాములను తీసుకెళ్తోంది. బోయింగ్ ‘క్రూ స్పేస్ ట్రాన్సో్పర్టేషన్ (సీఎస్టీ)–100 స్టార్ లైనర్’ మాత్రం వెనుకబడింది. ఎట్టకేలకు ఈ నెల 6న తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, స్టార్ లైనర్ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదమైతే మానవసహిత అంతరిక్ష యాత్రలకు దానికి లైసెన్స్ లభిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్ -
గగన్‌యాన్‌లో మహిళా పైలట్లకు ప్రాధాన్యం
తిరువనంతపురం: గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా చేపట్టే మానవసహిత అంతరిక్ష కార్యక్రమంలో మహిళా పైలట్లు, మహిళా శాస్త్రవేత్తలకే ఇస్రో ప్రాధాన్యం ఇస్తుందని, భవిష్యత్తులో మహిళా వ్యోమగాములనే అంతరిక్షంలోకి పంపుతామని సంస్థ చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రయోగించే మానవ రహిత గగన్‌యాన్ అంతరిక్ష నౌకలో మనిషిని పోలిన మహిళా హ్యూమనాయిడ్‌ను ఇస్రో పంపుతుందని తెలిపారు. 2025 నాటికి మానవ సహిత మిషన్‌ను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని దిగువ కక్ష్యలోకి పంపుతామని, అది మూడు రోజుల తర్వాత సురక్షితంగా భూమికి తిరిగి చేరుకుంటుందని వివరించారు. ప్రస్తుతానికి మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్లు దొరకనందున ఎయిర్ ఫోర్స్ ఫైటర్ టెస్ట్ పైలట్లనే అంతరిక్ష యాత్రకు ఎంపిక చేస్తున్నాం. మహిళా పైలట్లు అందుబాటులోకి వస్తే వారినే ఎంపిక చేసుకుంటాం. ఆ తర్వాత మహిళా సైంటిస్టుల వంతు. అప్పుడిక మహిళలకు ఎక్కువ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’ అని సోమనాథ్ చెప్పారు. 2035 నాటికి పూర్తి స్థాయిలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. శనివారం గగన్‌యాన్ యాత్రలో సన్నాహక పరీక్షల్లో భాగమైన క్రూ ఎస్కేప్ మాడ్యూల్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. -
అంతరిక్షంలోకి మనమూ మనుషులను పంపొచ్చు!
జీఎస్ఎల్వీ మార్క్- 3 ప్రయోగం విజయవంతం కావడంతో.. ఇక మన దేశం సగర్వంగా మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి మొదటి అడుగు పడినట్లయింది. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపడం ఇప్పటివరకు కేవలం అగ్రరాజ్యాలకు మాత్రమే తెలిసిన విద్య. ఇక మీదట మనవాళ్లు కూడా సురక్షితంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపగలరన్న విశ్వాసం కుదిరింది. రూ.155 కోట్ల ఖర్చుతో చేసిన ఈ ప్రయోగం.. తొలి అడుగులోనే ఘన విజయం సాధించింది. ఇస్రో ఇంతవరకు చేసిన అత్యంత బరువైన ప్రయోగం ఇదే. జీఎస్ఎల్వి మార్క్-3 ద్వారా క్రూ మాడ్యూలును నింగిలోకి పంపి, అక్కడి నుంచి మళ్లీ సురక్షితంగా నేల మీదకు తీసుకురాగలిగారు మన ఇస్రో శాస్త్రవేత్తలు. రాకెట్ పైభాగంలో మూడు వేల కిలోల కంటే బరువైన క్రూ మాడ్యూల్ (వ్యోమగాముల గది)ను అమర్చారు. భూమి నుంచి 126 కిలోమీటర్లు పైకి వెళ్లిన తరువాత దీనిని రాకెట్ వదిలేసింది. పారాచూట్ల సాయంతో ఈ క్రూ మాడ్యూల్ తిరిగి భూమికి చేరుకుంది. అండమాన్‌కు సమీపంలోని సముద్రం వద్ద దీన్ని ఇస్రో బృందం సేకరించింది. అండమాన్‌లోని ఇందిరా పాయింటుకు 180 కిలోమీటర్ల దూరంలో ఈ మాడ్యూల్ సముద్రంలో పడింది. మూడు టన్నులు, 3.1 మీటర్ల వ్యాసం ఉన్న ఈ మాడ్యూలు.. 31 మీటర్ల వ్యాసం ఉన్న పారాచూట్ సాయంతో కిందకి దిగింది. సెకనుకు 7 కిలోమీటర్ల వేగంతో మాడ్యూల్ కిందకు వచ్చింది. ఈ మాడ్యూలును ఆగ్రాలోని డీఆర్డీఓలో తయారుచేశారు. ఇద్దరి నుంచి ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లేలా దీన్ని రూపొందించారు.