
ఐఎస్‌ఎస్‌లో అడుగిడటం దేశ అంతరిక్ష చరిత్రలో నూతనాధ్యాయం
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రశంసలు
లోక్‌సభలో చర్చలో పాల్గొనని ప్రతిపక్షం
ఓట్ల చోరీ అంశంపై వాకౌట్
నేడు తిరిగి చర్చించే అవకాశం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో కాలుమోపి చరిత్ర సృష్టించిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. యాగ్జియం–4 మిషన్‌లో భాగంగా అమెరికా నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లి, విజయవంతంగా యాత్ర ను పూర్తి చేసుకున్న శుభాంశు శుక్లా ఆదివారం అమెరికా నుంచి స్వదేశానికి చేరుకోవడం, అపూర్వ స్వాగతం అందుకోవడం తెల్సిందే. సోమవారం లోక్‌సభలో శుభాంశు శుక్లాకు అభినందనలు తెలిపే తీర్మానాన్ని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ప్రవేశపెట్టారు.
శుభాంశు సాధించిన లక్ష్యాలను, భారత అంతరిక్ష ఆకాంలకు వాటి ప్రాముఖ్యతను ఆయన ఈ సందర్భంగా వివరించారు. అయితే, ఓట్ల చోరీ ఆరోపణలపై చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్ష పారీ్టలు నినాదాలతో సభను హోరెత్తిస్తున్నాయి. జాతికే గర్వకారణంగా శుభాంశు సాధించిన ఘనతను కొనియాడే విషయంలో కలిసి రావాలంటూ మంత్రి జితేంద్ర సింగ్ పదేపదే చేసిన వినతిని ప్రతిపక్షాలు పట్టించుకోలేదు. దీంతో, నిరసనల నడుమే ఆయన మాట్లాడారు. శుభాంశు శుక్లా సాధించిన విజయాలపై ప్రశంసలు కురిపించారు.
వికసిత్ భారత్‌కు నాంది
శుభాంశు శుక్లా సాధించిన ఘనతను ప్రశంసిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి జితేంద్ర సింగ్ ‘ఐఎస్‌ఎస్‌లోకి అడుగిడిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామి– 2047 నాటికి వికసిత్ భారత్–అంతరిక్ష రంగం పాత్ర’అంశంపై ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్షాలు మన వ్యోమగామి, గగన్‌యాత్రి శుభాంశు శుక్లా సాహసాన్ని తక్కువ చేస్తూ వాకౌట్ చేయడం దురదృష్టకరం’అని పేర్కొన్నారు.
‘శుభాంశు శుక్లా అందరికీ ఆదర్శంగా మారారు. నేడు ప్రతి చిన్నారి కూడా శుభాంశు శుక్లా స్థాయికి ఎదగాలని కలలు కంటున్నారు. ప్రపంచమంతా మనల్నే చూస్తోంది. ఇటీవలి ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ మనం సాధించిన అంతరిక్ష రంగ సాంకేతిక పురోగతి ఎంతగానో ఉపయోగపడింది’అని ఆయన పేర్కొన్నారు. 2040లో చంద్రుడిపై భారతీయుడు కాలుమోపడం ద్వారా వికసిత్ భారత్‌కు నాంది పలుకుతారని మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. అంతరిక్ష రంగంలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ రంగ భాగస్వామ్యం తదితర సంస్కరణలను వివరించారు.
.వీటి ఫలితంగా భారతీయ అంతరిక్ష రంగం 8 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి వచ్చే పదేళ్లలో ఏకంగా 45 బిలియన్ డాలర్లకు చేరుకోనుందన్నారు. 2026లో రోబోతో వ్యోమమిత్ర, 2027లో మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ను చేపట్టనున్నామని ప్రకటించారు. 2035లో సొంత అంతరిక్ష కేంద్రం, 2040కల్లా చంద్రుడిపైకి మొట్టమొదటి భారత వ్యోమగామి అడుగుపెట్టే దిశగా కృషి జరుగుతోందని చెప్పారు. ప్రతిపక్ష పారీ్టల సభ్యుల అంతరాయాలతో నిలిచిపోయిన చర్చ మంగళవారం తిరిగి కొనసాగనుంది.