
సాంకేతికతతోనే ప్రజలకు పాలన మరింత చేరువ
పౌర సేవల్లో ఏఐ, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ కీలకం
జాతీయ ఈ–గవర్నెన్స్ సదస్సులో సీఎం చంద్రబాబు
2035కి శ్రీహరికోటలో రెండో లాంచ్‌ప్యాడ్ ప్రారంభిస్తాం
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డా. జితేంద్రసింగ్
సాక్షి, విశాఖపట్నం: పాలనలో డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ అత్యంత ముఖ్యమైన అంశమని, టెక్నాలజీతోనే ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేయగలమని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఐటీ, ఈ–గవర్నెన్స్ అంశాలతో పాలనలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ ఈ–గవర్నెన్స్ సదస్సును ముఖ్యమంత్రి సోమవారం విశాఖలో ప్రారంభించారు. సివిల్ సర్విసెస్–డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ థీమ్‌తో జరుగుతున్న 28వ జాతీయ ఈ–గవర్నెన్స్ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల ద్వారా అందే పౌర సేవలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి సాంకేతికత కీలకమన్నారు.
ఏపీలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలతో కలిసి క్వాంటం వ్యాలీని ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. టెక్నాలజీ పరంగా సేవలు, ఉద్యోగాలు, ఉత్పాదన తదితర రంగాలు కూడా వేగంగా మారుతున్నాయని, ఈ పరిస్థితుల మధ్య వచ్చే పదేళ్ల కాలం మన దేశానికి అత్యంత కీలకమని చంద్రబాబు చెప్పారు. సమీప భవిష్యత్తులో స్పేస్, డ్రోన్, ఎల్రక్టానిక్ సిటీ, మెడ్‌టెక్ పార్కుల ద్వారా జాతీయ అభివృద్ధిలో ఏపీ ప్రధాన భాగస్వామి అవుతుందని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ ఏపీ సంచికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఎస్ కె. విజయానంద్‌తో పాటు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఒక్క అవార్డూ దక్కని ఏపీ..
ఇదిలా ఉంటే.. ఏడాది కాలంలో ఈ–గవర్నెన్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, అధికారులకు ఆరు కేటగిరీల్లో 19 అవార్డులు ప్రదానం చేశారు. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, సిక్కిం, త్రిపుర, ఒడిశా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు అవార్డులు వచ్చాయి కానీ, ఆంధప్రదేశ్‌కు ఒక్కటీ దక్కలేదు.
నాటికి ఇంటర్నేషనల్‌స్పేస్ స్టేషన్..
ఈ సదస్సులో భాగంగా సాయంత్రం జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డా. జితేంద్రసింగ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో ‘క్వాంటం డేటా సెంటర్’ను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. అలాగే, 2035 నాటికి భారత్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌తో సహా శ్రీహరికోటలో రెండో లాంచ్ ప్యాడ్‌ను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. గత దశాబ్ద కాలంలో జరిగిన పాలన సంస్కరణలతో వికసిత్ భారత్–2047 లక్ష్యాల్ని చేరుకోగలమని మంత్రి జితేంద్ర సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సదస్సుకు 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 1,200 మంది నిపుణులు, అధికారులు, పంచాయతీల ప్రతినిధులు హాజరయ్యారు.