
‘‘మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవో భవ’’.. అమ్మానాన్న తర్వాత ప్రత్యక్ష దైవం గురువే. టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా (Hardik Pandya), కృనాల్ పాండ్యా (Krunal Pandya) ఈ మాటను గట్టిగా నమ్ముతారు. అందుకే మూలాలు మర్చిపోకుండా ఈ అన్నదమ్ములిద్దరు తమ చిన్ననాటి కోచ్ పట్ల ఇప్పటికీ కృతజ్ఞతా భావం చాటుకుంటున్నారు.
కేవలం మాటల వరకు పరిమితం కాకుండా.. ఆర్థికంగానూ తమ ‘గురువు’ను ఆదుకుంటూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. గుజరాత్‌కు చెందిన పాండ్యా బ్రదర్స్ బాల్యం భారంగానే గడిచింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినా సరే.. ఆత్మవిశ్వాసంతో క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నారు. చదువును పక్కనపెట్టి ఆట కోసం ప్రాణం పెట్టారు.
చిన్న నాటి కోచ్ జితేంద్ర సింగ్ (Jitendra Singh) మార్గదర్శనంలో హార్దిక్, కృనాల్ రాటుదేలారు. ఐపీఎల్ నుంచి టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నారు. ఇక అన్న కృనాల్ కంటే.. తమ్ముడు హార్దిక్‌కే జాతీయ జట్టులో అవకాశాలు ఎక్కువ. టీమిండియాలో ఈ పేస్ ఆల్‌రౌండర్ ప్రస్తుతం కీలక సభ్యుడు.
రూ. 70- 80 లక్షల వరకు సాయం
ఇక ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి కోట్ల డబ్బు ఆర్జించిన క్రికెటర్లలో హార్దిక్ ముందుంటాడు. అయితే, తాను ఎదిగిన తర్వాత కూడా చిన్ననాటి గురువును అతడు మర్చిపోలేదు. అన్న కృనాల్‌తో కలిసి దాదాపు రూ. 70- 80 లక్షల వరకు జితేంద్ర సింగ్‌కు సాయం చేశాడు.
కారు కొనమని నాకు రూ. 20 లక్షలు
ఈ విషయాన్ని స్వయంగా జితేంద్ర సింగ్ వెల్లడించాడు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. ‘‘నా మొదటి చెల్లి పెళ్లికి హార్దిక్, కృనాల్ సాయం చేశారు. వారి వల్లే వివాహ వేడుక సాఫీగా సాగిపోయింది. అంతేకాదు.. కారు కొనమని నాకు రూ. 20 లక్షలు బదిలీ చేశారు.
ఇక 2024లో నా రెండో చెల్లి పెళ్లి కుదరగానే హార్దిక్ ఫోన్ చేసి.. ‘మీ చెల్లి.. నాకు కూడా చెల్లి లాంటిదే. తన వివాహాం.. ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలి. అన్నీ సవ్యంగా జరిగిపోవాలి. అందుకు ఈ అన్నయ్య సహకారం ఉంటుంది’ అని చెప్పాడు. అన్నట్లుగానే తనే అంతా చూసుకున్నాడు.

నా డబ్బంతా తీసుకో..
మా అమ్మ అనారోగ్యంతో ఉన్నపుడు కూడా.. ‘నా డబ్బంతా తీసుకుని ఆమె ఆరోగ్యం బాగు చేయించు’ అన్నాడు. అప్పుడు తను ఇంకా బరోడా జట్టుకు మాత్రమే ఆడుతున్నాడు. అంటే.. అప్పుడే తనకి ఎంత పరిణతి ఉందో అర్థం చేసుకోవచ్చు. 2015-2016లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత.. అంటే తన అరంగేట్రం తర్వాత హార్దిక్ నాకు కారు కొనుక్కోమని రూ. 5-6 లక్షలు పంపించాడు.
బైక్ మీద వెళ్తే..
నాకు ఇలాంటివి వద్దని వారించాను. కానీ కృనాల్ ఒప్పించాలని చూశాడు. కానీ నేను వద్దనే చెప్పాను. అప్పుడు హార్దిక్ వచ్చి.. ‘ఈ కారు మీ సేఫ్టీ కోసం మాత్రమే. బైక్ మీద వెళ్తే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఎక్కువ కాబట్టే కారు కొనమంటున్నా’ అని నన్ను ఒప్పించాడు. కోచ్ పట్ల తనకున్న అభిమానం అలాంటిది.
కృనాల్ నాకు రూ. 18 లక్షలు పంపాడు
నాకున్న మంచి దుస్తులన్నీ హార్దిక్, కృనాల్ కొనిచ్చినవే. ఇప్పటి వరకు నాకు పాండ్యా సోదరులు రూ. 70- 80 లక్షలు సాయం చేసి ఉంటారు. 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున టైటిల్ గెలవగానే కృనాల్ నాకు రూ. 18 లక్షలు పంపించాడు.
ఎల్లవేళలా నేను సౌకర్యంగా ఉండాలనే వారు ఆలోచిస్తారు. నాది దిగువ మధ్య తరగతి కుటుంబం. వారు మాత్రం నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు’’ అని జితేంద్ర సింగ్ ఉద్వేగానికి లోనయ్యాడు. కాస్త డబ్బు కనబడగానే కుటుంబ సభ్యులనే దూరం పెట్టే మనుషులు ఉన్న నేటి సమాజంలో.. గురువు పట్ల ఇంత అభిమానం చూపుతున్న పాండ్యా బ్రదర్స్ నిజంగా గ్రేట్ కదా!.. ఉపాధ్యాయులందరికీ హ్యాపీ టీచర్స్ డే!!
చదవండి: రూ. 4 వేల కోట్ల ప్యాలెస్.. 560 కిలోల బంగారం, వెండి రైలు, రథం.. ఇంకా..