
రాజకుటుంబాలకు విలాసవంతమైన జీవితం కొత్తకాదు. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వారికి చిటికేస్తే సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.. అడుగు కదపకుండానే కోరుకున్నవన్నీ కాళ్ల దగ్గరకు వచ్చేస్తాయి. అయితే, ఆ హోదాను, ముద్రను దాటి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది వ్యక్తుల్లో 29 ఏళ్ల మహాన్ ఆర్యమన్ సింధియా ఒకడు.
క్రికెట్ ప్రపంచంలో ఈ రాజకుమారుడు సరికొత్త అధ్యాయం లిఖించాడు. అత్యంత పిన్న వయసులో ఓ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. తాత, తండ్రి బాటలో నడుస్తూ ఇటీవలే మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) అధ్యక్షుడిగా ఆర్యమన్ ఎంపికయ్యాడు.
ఇంతకీ ఎవరీ ఆర్యమన్?
గ్వాలియర్‌లోని సింధియా రాజకుటుంబ వారసుడు మహాన్ ఆర్యమన్. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య కుమారుడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన రాజవంశీకుడు మాధవరావు సింధియా మనుమడు.
ఉన్నత విద్యావంతుడిగా..
డోహ్రాడూన్‌లోని డూన్ పాఠశాలలో 2008- 2014 మధ్య మహాన్ ఆర్యమన్ విద్యనభ్యసించాడు. 2019లో అమెరికాలోని యేల్ యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ సాధించాడు. అంతేకాదు.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అంతర్జాతీయ వ్యవహారాలు, సంబంధాల గురించి అధ్యయనం చేశాడు.
వ్యాపారవేత్తగా మారి..
2014లో భూటాన్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ సెంటర్‌లో మహాన్ ఆర్యమన్ ఇంటర్న్‌షిప్ చేశాడు. ఆ తర్వాత న్యూఢిల్లీలో ఆర్థిక శాఖలో, లండన్లోని క్రిస్టీలో ఇంటర్న్‌గా ఉన్నాడు. సాఫ్ట్‌బ్యాంకు, న్యూయార్క్‌లోని మార్కో అడ్వైజరీ పార్ట్‌నర్స్‌లోనూ పనిచేశాడు.
ఇక 2019 నుంచి 2021 వరకు ముంబైలోని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపులో మహాన్ ఆర్యమన్ అసోసియేట్‌గా సేవలు అందించాడు. ఆ తర్వాత 2021- 2024 వరకు అండర్‌సౌండ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జై విలాస్ ప్యాలెస్ డైరెక్టర్‌గా పనిచేశాడు. కాగా 2022లో మహాన్ ఆర్యమన్ కుబేర్ ఏఐని.. ఆ తర్వాత రెండేళ్లకు ఇతారా ఏఐని లాంచ్ చేశాడు.
క్రికెట్ పరిపాలనా విభాగంలో..
గ్వాలియర్ డివిజన్ క్రికెట్ అసోసియేషన్ (GDCA) ఉపాధ్యక్షుడిగా మహాన్ ఆర్యమన్ 2022లో ఎన్నికయ్యాడు. అదే విధంగా మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌లోనూ అతడు శాశ్వత సభ్యత్వం పొందాడు. ఇక 2024లో మధ్యప్రదేశ్ క్రికెట్ లీగ్‌ను ఆరంభించిన మహాన్ ఆర్యమన్.. 2025లో ఎంపీసీఏ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
ఈ రాజకుటుంబం విలాసాలకు చిరునామా
సింధియా కుటుంబం గ్వాలియర్‌లోని జై విలాస్ ప్యాలెస్‌లో నివసిస్తోంది. దాదాపు పదిహేను ఎకరాల్లో విస్తరించిన ఈ రాజభవనం విలువ రూ. 4 వేల కోట్లకు పైమాటే అని అంచనా.
ఇందులో నాలుగు వందలకు పైగా గదులు ఉన్నట్లు సమాచారం.
అంతేకాదు.. సుమారు 560 కిలోల బంగారాన్ని వివిధ ఆకృతుల్లో వాడినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. విలాసవంతమైన ఈ భారీ ప్యాలెస్‌లో ఫ్రెంఛ్, పర్షియన్ ఆర్ట్‌క్రాఫ్ట్‌లు ఎన్నో ఉన్నాయి.
ఇక ఈ రాజభవంలోని డైనింగ్ హాల్‌లో వెండి రైలును ఇప్పటికీ ఉపయోగిస్తారట. టేబుల్‌పై ఓ వెండి రథం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. దాదాపు ఎనిమిది ఏనుగుల బరువుకు సరితూగే బరువుతో ఇక్కడి పైకప్పును పరీక్షించి.. భారీ, అందమైన షాండ్లియర్‌ను వేలాడదీసినట్లు కథనాలు ఉన్నాయి.
చదవండి: ఇంకెంత రెస్ట్ కావాలి: రోహిత్‌పై గంభీర్ ఫైర్.. నాడు..