విపక్షసభ్యులకు ప్రధాని మోదీ చురకలు
నిర్మాణాత్మక, విధానాత్మక చర్చలకు పార్లమెంట్ వేదిక కావాలి
శీతాకాల సమావేశాల ఆరంభానికి ముందు పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాని ప్రసంగం
బిహార్ ఓటమి నైరాశ్యాన్ని సభలో చూపొద్దని విపక్షాలకు హితవు
కొత్త వ్యూహాల కోసం మీకు చిట్కాలు చెపుతానని ఎద్దేవా
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కొద్దిసేపటిముందు పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షసభ్యులకు హితబోధచేస్తూ ప్రధాని మోదీ పలు విమర్శనాత్మక, వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. ‘‘ పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కసరత్తు చేసే వ్యాయామశాలగా పార్లమెంట్‌ను మార్చొద్దు. ఇటీవల ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన విపక్షపార్టీలు ఆ నైరాశ్యాన్ని పార్లమెంట్‌లో ప్రదర్శించాలనుకుంటున్నాయి.
పార్లమెంట్ పవిత్రమైంది. ఇది నాటకాలు వేసే రంగస్థలం కాదు. పార్లమెంట్ అనేది నిర్మాణాత్మకమైన, ఫలవంతమైన చర్చలు, సద్విమర్శలకు పట్టుగొమ్మ. బలమైన ఆధారాలతో ప్రభుత్వంపై విమర్శలకు విపక్షాలు దిగుతాయంటే నేను సైతం వారికి కొన్ని చిట్కాలు చెబుతా’’ అని మోదీ చురకలంటించారు.
డ్రామాలకు వేరే స్థలాలున్నాయ్..
‘‘నాటకాలు ప్రదర్శించడానికి పార్లమెంట్ వేదిక కాదు. వాటికి వేరే వేదికలున్నాయి. అక్కడ వేసుకోండి మీ డ్రామాలు. ఇది ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ చట్టాలుచేసే పవిత్ర స్థలి. డ్రామాలొద్దు.. పనిచూడండి. అయినాసరే నినాదాలు చేస్తామంటే మీరు దేశంలో ఎక్కడైనా చేసుకోండి. గతంలో ఓడిపోయిన రాష్ట్రాల్లోనూ పెద్దపెద్ద ప్రసంగాలిచ్చారు. భవిష్యత్తులో ఓటమిని చవిచూడబోయే నియోజకవర్గాలకు వెళ్లి ప్రసంగాలివ్వండి.
పార్లమెంట్ విషయానికొచ్చేసరికి మీ దృష్టంతా కేవలం విధానపర నిర్ణయాలపై జరపాల్సిన విస్తృతస్థాయి చర్చల మీదనే ఉండాలి. నినాదాల మీద కాదు. బిహార్‌లో మా అద్వితీయమైన విజయాన్ని చూశాకైనా విపక్ష సభ్యులు బాధ్యతతో వారి నియోజకవర్గాల్లో పనులు నిర్వర్తించాలని తెలుసుకోవాలి. అంతేగానీ రాబోయే ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు కసరత్తు క్రీడాస్థలిగా పార్లమెంట్‌ను దుర్వినియోగం చేయొద్దు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు
‘‘బిహార్‌లో ఎదురైన ఘోర పరాభవాన్ని విపక్షపార్టీలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ ఓటమి నుంచి పుట్టుకొచ్చిన ఆక్రోశంతో పార్లమెంట్ వంటి వేదికలపై గందరగోళం సృష్టించకూడదు. మా విజయం కూడా దురహంకారంగా ఏమీ మార బోదు. సమాచారాత్మక సద్విమర్శను మేం కోరుకుంటున్నాం. సభ్యులందరూ నిర్మాణాత్మక, కచ్చితత్వంతో కూడిన సద్విమర్శలకే పెద్దపీట వేయాలి. అప్పుడే పౌరులకు సైతం మన నుంచి సరైన సందేశం వెళ్తుంది.
ఇలాంటి సంస్కృతినే పార్లమెంట్ సమావేశాల నుంచి పౌరులు కోరుకుంటున్నారు. దేశానికి ఇదే అత్యావశ్యకం’’ అని మోదీ అన్నారు. ‘‘పార్లమెంట్ కార్యకలాపాలపై విపక్షాల ఓటమి నీడ పడకుండా చూసుకోవాలి. ఈసారి శీతాకాల సమావేశాల్లో అన్ని పార్టీల సభ్యుల నుంచి బాధ్యత, సమతుల్యత, సమగౌరవాన్ని ఆశిస్తున్నా. బిహార్ ఎన్నికల్లో నమోదైన అత్యధిక పోలింగ్ శాతం అనేది ప్రజాస్వామ్యంలోని గొప్పతనాన్ని చాటుతోంది. ఈ ఎన్నికల ఓటమి నుంచి విపక్షాలు వెనువెంటనే తేరుకొని తమ విపక్షపాత్రను సమర్థవంతంగా పోషిస్తాయని ఆశిస్తున్నా’’అని అన్నారు.
వాళ్ల పదేళ్ల ఆటను జనం మెచ్చలేదు
‘‘విపక్ష పార్టీలు గత దశాబ్దాకాలంగా ఆడుతున్న రాజకీయ క్రీడలను ఇప్పటికీ పౌరులు మెచ్చట్లేరు. ఇకనైనా ఆట తీరును విపక్షాలు మార్చుకోవాలి. ఈ విషయంలో ఏమైనా సలహాలు ఇచ్చేందుకు నేను సిద్ధం. కావాలంటే కొన్ని చిట్కాలు చెప్తా’’ అని మోదీ వెటకారంగా మాట్లాడారు. ‘‘ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు నెరవేర్చాల్సిన విధ్యుక్తధర్మాన్ని గుర్తెరగాలి. ఓటమి నుంచి వాళ్లింకా తేరుకోలేదని నిన్న వాళ్ల నేతలు చేసిన ప్రసంగాలు వింటే అర్థమవుతోంది. ఓటమి అనేది వాళ్లను ఎంతగా చిత్రవధ చేస్తోందో తెలుస్తోంది’’ అని అన్నారు. ‘‘సభలో చర్చల వేళ కొత్త తరం సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పించాలి. అనుభవజ్ఞుల అనుభవసారాన్ని పార్లమెంట్ గ్రహిస్తూనే భావినేతల తాజా ఆలోచనలకూ పార్లమెంట్ తగు ప్రాతినిధ్యం కల్పిస్తుంది’’ అని మోదీ అన్నారు.
Speaking at the start of the Winter Session of Parliament. May the session witness productive discussions. https://t.co/7e6UuclIoz
— Narendra Modi (@narendramodi) December 1, 2025
ఇదీ చదవండి: పార్లమెంట్‌లో ఏపీ గళం వినిపించండి


