అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ వాయిదా

India defers full resumption of international flights - Sakshi

ఒమిక్రాన్‌ నేపథ్యంలో డీజీసీఏ నిర్ణయం

న్యూఢిల్లీ/ జెనీవా/లాగోస్‌: అంతర్జాతీయ విమానాలను ఈ నెల 15 నుంచి పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్‌ వేరియెంట్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో విమానాలను అనుకున్న ప్రకారం నడపకూడదని బుధవారం డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిర్ణయించింది. విమానాల రాకపోకలకు సంబంధించిన కొత్త తేదీపై నిర్ణయం తీసుకోలేదు. కోవిడ్‌ నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని కేంద్రం రద్దు చేసింది. ఈనెల 15 నుంచి పునరుద్ధరించాలని గత నెల 26న నిర్ణయించింది. తర్వాత ఒమిక్రాన్‌ కలకలం రేగడంతో పునరుద్ధరణను వాయిదావేసింది. దేశంలో ఈ కేసు లు లేకున్నా గట్టి చర్యలు తీసుకుంటోంది.

నిషేధంతో అరికట్టలేరు: డబ్ల్యూహెచ్‌వో  
అంతర్జాతీయ ప్రయాణాలను నిషేధించినంత మాత్రాన ఒమిక్రాన్‌ వ్యాప్తిని అరికట్టలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వైరస్‌ వెలుగులోకి వచ్చినప్పట్నుంచి ఆఫ్రికా దేశాలను లక్ష్యంగా చేసుకొని పలు దేశాలు విమానాల రాకపోకల్ని నిషేధిస్తూ ఉండడంతో డబ్ల్యూహెచ్‌ఒ చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రాయాసెస్‌ స్పందించారు. ప్రయాణాలను నిషేధిస్తే మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందన్నారు. వ్యాక్సిన్‌ వేసుకోని వారు, 60 ఏళ్ల పైబడిన వారు ప్రయాణాలు మానుకోవాలని హితవు పలికారు. కాగా, అమెరికాలో ఒమిక్రాన్‌ తొలి కేసు కాలిఫోర్నియాలో బుధవారం నమోదైంది.

దక్షిణాఫ్రికా కంటే ముందే నైజీరియాలో ఒమిక్రాన్‌
పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ అక్టోబర్‌లో బయటపడింది. ఈ వేరియెంట్‌పై ప్రపంచ దేశాలను దక్షిణాఫ్రికా హెచ్చరించడానికి ముందే నైజీరియాలో ఇది వెలుగులోకి వచ్చిందని ఆ దేశ ప్రజారోగ్య సంస్థ వెల్లడించింది. ‘గత వారంలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నమూనాలో జన్యుక్రమాన్ని పరిశీలిస్తే ఒమిక్రాన్‌ కేసులు అని తేలింది. ఆ నమూనాలు పరీక్షించినప్పుడే అక్టోబర్‌లో సేకరించిన శాంపిళ్లనూ పరీక్షిస్తే ఒమిక్రాన్‌ వేరియెంట్‌గా నిర్ధారణ అయింది. అంటే రెండు నెలల కిందటే ఒమిక్రాన్‌ వేరియెంట్‌ పుట్టుకొచ్చిందని అర్థమవుతోంది’ అని నైజీరియా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top