సాక్షి, తిరుపతి: జాతీయ సంస్కృత యూనివర్శిటిలో(Tirupati Sanskrit Versity) లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధిత యువతి వీడియో స్టేట్‌మెంట్ రికార్డు చేసిన తిరుపతి మహిళా పోలీసులు.. కీలకమైన వివరాలను రాబట్టినట్లు తెలుస్తోంది.
ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ పలు మార్లు లైంగికంగా వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక పైఅధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యా. అయితే ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి వద్ద మన ఇద్దరి వీడియో ఉందని చెబుతూ లక్ష్మణ్ బెదిరించాడు. ఆపై పలుమార్లు లైంగికంగా వేధించాడు అని వివరించింది. ఈ క్రమంలో.. లక్ష్మణ్‌కు కఠినమైన శిక్ష పడాలి అని పోలీసుల వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తిరుపతి వెస్ట్ స్టేషన్ నుంచి మహిళా పోలీసుల బృందం ఒడిశా జార్హ్ పూర్‌లో బాధితురాలిని విచారించి.. వీడియో స్టేట్ మెంట్ రికార్డు చేశారు. బాధితురాల స్టేట్మెంట్ ఆధారంగా ఇద్దరు ప్రొఫెసర్లను పోలీసులు అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.
పార్లమెంట్‌లో ప్రస్తావన..
తిరుపతి సంస్కృత వర్సిటీ ఘటన పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది. లోక్‌సభలో సోమవారం అడ్జర్న్‌మెంట్ మోషన్ నోటీసు ద్వారా వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. బీఈడీ మొదటి సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థినిని అదే వర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధించారని సభలో తెలిపారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరించారన్నారు. అది అత్యంత హేయమ చర్యగా అభివర్ణించారు. దళిత విద్యార్థినిపై ఇటువంటి దురాగతం జరగడం పట్ల పార్లమెంట్ వేదికగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన గురువులే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం తిరుపతి ప్రతిష్టకు దెబ్బతీస్తోందని ఎంపీ పేర్కొన్నారు.
కేసు నమోదు..
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో (National Sanskrit University) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణకుమార్ విద్యార్థినిపట్ల ప్రవర్తించిన తీరుపై తిరుపతి వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్ రజినీకాంతుక్లా ఫిర్యాదు మేరకు వెస్ట్ పోలీసులు 183/2025 కేసు నమోదైందని ఎస్పీ కార్యాలయం తెలిపింది. దీనిపై విచారణకు తిరుపతి డిఎస్పీ భక్తవత్సలంను దర్యాప్తు అధికారిగా, ఇద్దరు మహిళ ఎస్ఐలను సహాయ అధికారులుగా నియమించారు.


