శబరిమల యాత్రకు అయ్యప్ప భక్తుల రద్దీ కొనసాగుతోంది. లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో.. అటవీశాఖ అధికారుల భక్తులకు కీలక సూచన చేశారు. ఉరక్కుళి జలపాతం వైపుగా వెళ్లకూడదని మంగళవారం ఆంక్షలు జారీ చేశారు.
ఉరక్కుళి జలపాతం ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. అక్కడ ఏనుగులు, అడవి పందులు, చిరుతలు తరచుగా సంచరిస్తుంటాయి. గతంలో కొంతమంది యాత్రికులు అక్కడికి వెళ్లి వన్యప్రాణుల దాడికి గురైన సంఘటనలు నమోదయ్యాయి. అదనంగా, జలపాతం ప్రాంతం రాళ్లతో నిండినదిగా ఉండటం వల్ల జారి పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా భక్తుల ప్రాణ భద్రత కోసం అటవీశాఖ ఈ హెచ్చరికను జారీ చేసింది.
అయ్యప్ప సన్నిధానానికి అటవీ మార్గంలో వెళ్లే కొందరు భక్తులు.. పంపా పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా పర్యాటక ఆకర్షణగా ఉన్న ఉరక్కుళి జలపాతం వైపు వెళ్తుంటారు. అయితే, ఇటీవల వన్యప్రాణుల కదలికలు పెరగడం, ప్రమాదకర సంఘటనలు చోటుచేసుకోవడం వల్ల కేరళ అటవీశాఖ భక్తులకు అక్కడికి వెళ్లొద్దు అని విజ్ఞప్తి చేసింది.
శబరిమల యాత్రికులు పంపా సన్నిధానం మార్గం మాత్రమే ఉపయోగించాలని అధికారులు స్పష్టం చేశారు. అడవుల్లోకి వెళ్లడం, జలపాతం సందర్శన లాంటి ప్రయత్నాలు చేసి రిస్క్‌లో పడొద్దని కోరుతుతున్నారు. ‘‘శబరిమల యాత్ర ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణం. దానిని సురక్షితంగా, నియమ నిబంధనలకు లోబడి కొనసాగించడం ప్రతి భక్తుడి బాధ్యత. ఉరక్కుళి జలపాతం వంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా.. అధికారుల సూచనలను పాటించడం ద్వారా యాత్ర మరింత సాఫీగా, భద్రంగా సాగుతుంది’’ అని ప్రకటనలో అధికారులు కోరారు.
పోటెత్తిన అయ్యప్ప స్వాములు
శబరిమలలో డిసెంబర్ 8న సన్నిధానం, పంబా ప్రాంతాలు తిరిగి భక్తులతో కిక్కిరిశాయి. సాయంత్రం 4 గంటల వరకు లెక్క ప్రకారం 73,679 మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. వీళ్లలో స్పాట్ బుకింగ్ ద్వారా వచ్చిన వాళ్లు.. 11,999 మంది. పథినెట్టాంపడి(18 మెట్లు) ఎక్కడానికి 4 గంటల సమయం పట్టింది.


