గోవా అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిర్స్ నైట్ క్లబ్ లో జరిగిన ప్రమాదం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానూభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ తో మాట్లాడినట్లు మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
బిర్స్ నైట్ క్లబ్ లో జరిగిన అగ్నిప్రమాదంపై ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనా స్థలాన్ని సీఎం అధికారులతో కలిసి పరిశీలించారు. బిర్స్ నైట్ క్లబ్ సరైన నిబంధనలు పాటించలేదని ప్రాథమిక విచారణలో తేలిందని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై విచారణ ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
ఉత్తర గోవాలోని అర్పోరాలోని బిర్స్ నైట్ క్లబ్ లో అర్థరాత్రి గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 23 మంది మరణించగా వీరిలో ముగ్గురు మహిళలు, నలుగురు పర్యాటకులు ఉన్నారు.ప్రమాదంలో మృతి చెందిన వారిలో అధికమంది క్లబ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా మిగితావారంతా ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పి సహాయక చర్యలు ప్రారంభించాయి.


