ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
వనపర్తి: తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిందో భార్య. ఆపై మృతదేహాన్ని మాయం చేసేందుకు సినీ ఫక్కీలో పథకం రచించింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. ఆయన వివరాల మేరకు..
వనపర్తి పట్టణంలోని గణేశ్‌నగర్ కాలనీకి చెందిన కురుమూర్తి, కె.నాగమణి భార్యాభర్తలు. కొన్నాళ్లుగా నాగమణి ఎన్.శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే తమ బంధానికి కురుమూర్తి అడ్డొస్తున్నాడని.. ఎలాగైనా హతమార్చాలని పథకం రచించారు. అందులో భాగంగా గతనెల 25న ఇంట్లోనే అతడికి మద్యం తాగించారు. ఆ తర్వాత తాడును గొంతుకు బిగించి హతమార్చారు.
మృతదేహాన్ని మాయం చేసేందుకు ఓ కారును సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నారు. ఇక్కడి నుంచి శ్రీశైలం సమీపంలోని కృష్ణానది వద్దకు చేరుకొని మృతదేహాన్ని నీటిలో పడేశారు. ఈ క్రమంలో కురుమూర్తి కనిపించడం లేదని అతడి సోదరుడు గతనెల 28న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టగా, ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. కృష్ణానదిలో మూడు రోజులపాటు గాలించి శవాన్ని గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక ఆధారాలతో హత్య కేసును ఛేదించి.. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. 72 గంటల్లో హత్య కేసును ఛేదించిన సీఐ కృష్ణతో పాటు ఎస్‌ఐలు, కానిస్టేబుల్స్‌ను ఎస్పీ అభినందించారు.


